కాళేశ్వరంలో రామడుగు వద్ద 400కెవి సబ్‌స్టేషన్‌

విజయవంతంగా ఛార్జింగ్‌ పూర్తి
వెల్లడించిన ఇంజనీరింగ్‌ అధికారులు
హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ముగిసింది. లింక్‌ 2, ప్యాకేజీ 8 రామడుగు వద్ద నిర్మాణం జరుగుతున్న 400 కేవీ సబ్‌ స్టేషన్‌ చార్జింగ్‌ విజయవంతం అయ్యింది. రామడుగు పంప్‌ హౌజ్‌ లో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుల బిగింపు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి చేసుకొని చార్జింగ్‌ కూడా జరిగిన మొదటి పంప్‌ హౌజ్‌ ఇదే. ఆదివారం ట్రాన్స్‌ కో డైరెక్టర్‌ సూర్యప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.వి.ప్రభాకర్‌ రావు పర్యవేక్షణలో చార్జింగ్‌ పక్రియ విజయవంతమయ్యింది. ఈ విషయాన్ని వారు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటువంటి 400 కేవీ సబ్‌ స్టేషన్లు మరో 5 ఉన్నాయి. 220 కేవీ సబ్‌ స్టేషన్లు 8, 132 కేవీ సబ్‌ స్టేషన్లు 2, 33 కేవీ సబ్‌ స్టేషన్‌ 1 ఉన్నాయి. ప్రాజెక్టులో మొత్తం విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 17 ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో 400 కేవీ సబ్‌ స్టేషన్ల సంఖ్య 17. ట్రాన్స్‌ కో ఇతర అవసరాల కోసం 11 సబ్‌ స్టేషన్లను ఇది వరకే నిర్మించింది. 400 కేవీ సబ్‌ స్టేషన్లు 6 ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే నిర్మిస్తుండటం విశేషం. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం నిర్దారణ అవుతుందని ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. విద్యుత్‌ వినియోగం 500 మెగావాట్ల పైబడి ఉంటే 400 కేవీ  సబ్‌ స్టేషన్లు, 500 మెగావాట్లకు తక్కువగా విద్యుత్‌ వినియోగం ఉంటే 220 కేవీ సబ్‌  స్టేషన్లు, 100 మెగావాట్ల కంటే తక్కువ వినియోగం ఉంటే 132 కేవీ సబ్‌  స్టేషన్ల నిర్మాణం చేయవలసి ఉంటుందని పెంటారెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌ 1, లింక్‌ 2 లో ఉన్న సబ్‌ స్టేషన్ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి జూలై చివరినాటికి వాటి చార్జింగ్‌ పక్రియ పూర్తి చేస్తామని సూర్యప్రకాశ్‌ చెప్పారు. లింక్‌ 4 లో ఉన్న సబ్‌ స్టేషన్ల నిర్మాణం, చార్జింగ్‌ పక్రియ సెప్టెంబర్‌ చివరినాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ జెన్‌ కో, ట్రాన్స్‌ కో చైర్మన్‌ దేవులపల్లి ప్రభాకర్‌ రావు గైడెన్స్‌, మంత్రి హరీష్‌ రావు నిరంతర పర్యవేక్షణ, సహకారంతోనే రామడుగు సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. ఆదివారం చార్జింగ్‌ కూడా జయప్రదం అయ్యిందని ఆయన వివరించారు. రామడుగు 400 కేవీ సబ్‌ స్టేషన్‌ చార్జింగ్‌ పక్రియను విజయవంతంగా నిర్వహించిన ట్రాన్స్‌ కో అధికారులను, ఇరిగేషన్‌ అధికారులని మంత్రి హరీష్‌ రావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా సబ్‌ స్టేషన్ల నిర్మాణం, చార్జింగ్‌ పక్రియను జయప్రదంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోట్రాన్స్‌ కో సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు సరస్వతి, నాగరాజు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ భూమయ్య, ఇరిగేషన్‌ శాఖ కాళేశ్వరం ప్రాజెక్ట్‌  ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నూనె శ్రీధర్‌, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.