కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తాం
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
వరంగల్,జనవరి 19(జనంసాక్షి): నగరంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రానికి నిధుల కొరత లేకుండా త్వరగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వాలు కళాకారులను నిర్లక్ష్యం చేశాయని.. తెరాస అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కళాకారులకు పెద్దపీట వేశారన్నారు. వరంగల్ నగరానికి చెందిన ప్రఖ్యాత రచయిత కాళోజీ నారాయణరావు పేరిట గతంలోనే ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అది అద్భుతంగా పని చేస్తోందన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని గతంలోనే ప్రారంభించినప్పటికీ… నిధులు కొరత కారణంగా ఆలస్యమైందని చెప్పారు. దీనిని త్వరితగతిన పూర్తిచేసేందుకు కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీతో ఒప్పందం చేసుకున్నామని వినోద్‌కుమార్ తెలిపారు.