కావూరిజీ సిరిసిల్లకు రండి

కేటీఆర్‌ సాదర ఆహ్వానం
హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :
కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం కలిశారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నటికీ తేల్చదని మండిపడ్డారు. తెలంగాణ, సీమాంధ్రల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని ఆయన కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంశంలో రాజీ తప్పదు అని కావూరి వ్యాఖ్యానించిన తర్వాతి రోజే కేటీఆర్‌ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణపై సానుకూలత వ్యక్తం చేసిన కావూరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో రూ.210 కోట్ల అంచనాతో కాన్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరానని చెప్పారు. అలాగే, మరమగ్గాల కార్మికులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని, పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయాలని కోరామన్నారు. సిరిసిల్లలో పర్యటించాలని కావూరిని కోరగా… పంచాయతీ ఎన్నికల తర్వాత సిరిసిల్ల పర్యటనకు వస్తానని చెప్పారని తెలిపారు. సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసేందుకు కావూరిని కలిశానని చెప్పారు. తమ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణపై కేంద్ర మంత్రి హోదాలో కావూరి బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేశారని ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. హైకమాండ్‌లో కావూరి కూడా భాగంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత నేతలు ఆదివారం నిర్వహించనున్న సభ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తేల్చకుండా ఎన్ని సభలు పెట్టినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.