కూరగాయాల మార్కెట్‌ను సక్రమంగా నిర్వహించాలి
ఖమ్మం, జూలై 20 : ఖమ్మం పట్టణంలో ఉన్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహణ సక్రమంగా జరగాలని ఖమ్మం వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు మానుకొండ రాధాకిషోర్ అన్నారు. గురువారం నాడు ఆయన ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూరగాయల ధరల నియంత్రణ, ఎగుమతులు, దిగుమతులు, రైతు సరుకు మార్కెట్‌కు చేరిన తరువాత బిడ్డింగ్ నమోదు, సరుకు అందిన తరువాత, రైతులకు బిల్లులు ఇవ్వడం, బయటి నుంచి కూరగాయలు కొనుగోలు చేసి వ్యాపారులు మార్కెట్ ఫీజులు చెల్లిస్తున్నారా? లేదా అనే విషయాలపై వ్యాపారులతో చర్చలు జరుపుతామన్నారు. మార్కెట్‌లో అద్దెకు ఇచ్చిన దుకాణాల నుంచి ఫీజు వసూలు ఎలా ఉందన్న విషయాన్ని కూడా అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కెట్‌లో పారిశుద్ధ్య చర్యలు కూడా సజావుగా ఉండాలన్నారు. బయటి నుంచి మార్కెట్ వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.