కృష్ణమ్మ పరవళ్లు
– జూరాలకు జలకళ
మహబూబ్‌నగర్,ఆగస్టు 5(జనంసాక్షి):జూరాల ప్రాజెక్టు వద్ద వరదనీటి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అప్పర్ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి నీరు దిగువకు విడుదల అవుతుండగా, ప్రధాన ఎడమ కాలువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువనున్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తుంగభద్ర నదిలో ఉద్ధృతి కొనసాగింది. ఇక్కడి నుంచి సుంకేసుల జలాశయానికి చేరుతోంది. దీంతో జలాశయం నుంచి గేట్లను ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో మరో రెండు రోజులపాటు వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉందని జలాశయం అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద ప్రవాహం పోటుత్తెతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ జోరు కొనసాగింది. వరద నీటి పరవళ్లను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జూరాల కళకళలాడింది.