కెసిఆర్‌ కబంధ హస్తాల్లో తెలంగాణ: బిజెపి


కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్‌ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు
గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ప్రజాసంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ భూములు అమ్మి హుజూరాబాద్‌లో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పథకాలు అమలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజా అవసరాలపై నిరంతరం దృష్టి సారించాల్సిన అధికారులను కార్యకర్తల్లా మార్చుకొని, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో పని చేయిస్తుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.