కెసిఆర్ సారధ్యంలోనే సంక్షేమ కార్యక్రమాలు
పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అర్వింద్
బిజెపి నేతలను ఎక్కడిక్కడే నిలదీయాల్సిందే: గంప
కామారెడ్డి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుండడంతో చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. రైతులను మోసం చేయడంలో, దేశ సంపదను అమ్ముకోవడంలో బీజేపీ ప్రభుత్వం నెంబర్ వన్‌లో ఉందని ఎద్దేవా చేశారు. ఏడున్నర సంవత్సరాలుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు
డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా బోర్డు రాకుండా అడ్డుకున్నా రంటూ విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని హావిూ ఇచ్చిన ఎంపి ధర్మపురి అర్వింద్ జిల్లా ప్రజలను మోసం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పార్టీ నాయకులకు ప్రజలతో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ మంత్రులే ప్రశంసిస్తున్నా రని అన్నారు. ఇక్కడి పథకాలను పలు బీజేపీ పాలిత రాష్టాల్ల్రో అమలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు దేశం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ కేంద్రంపై ఉద్యమం చేసేందుకు అడుగులు వేస్తున్నారని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అలాంటి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లాను వ్యవసాయ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సింహం లాంటిదని ప్రజల గుండెల్లో ఎప్పుడు రారాజుగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలే తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, రైతు బీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తూ రైతన్నలకు అన్నం పెడుతుండగా కేంద్రంలో ఉన్న బీజేపీ, మోదీ ప్రభుత్వం రైతాంగానికి సున్నం పెడుతుందని తీవ్రంగా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల బోరు మోటార్లకు విూటర్లను బిగించి చార్జీల పేరిట దోపిడీ చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిని బిజెపి నేతలు ఎందుకు నిలదీయడం లేదన్నారు.