కేటీఆర్ సమర్ధుడు
సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి
మంత్రి తలసాని
హైదరాబాద్జనవరి 20 (జనంసాక్షి):
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ పలువురు తెరాస నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా అంతర్గతంగా జరిగిన ప్రచారం.. గత కొద్దిరోజులుగా బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని సమర్థిస్తూ తాజాగా పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్ అన్నారు. ఈ విషయంపై తగిన సమయం లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా నాయకులు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో నీళ్లు లేక రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ప్రస్తుతం రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు భాజపాకు లేదని తలసాని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్ ఆధ్వర్యంలో జరగాలి
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ గ్రావిూణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలన్నదే తన ఆకాంక్ష అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు.