కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ
కరీంనగర్,మే11(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా కొత్త బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణికులకు భరోసా పెరిగి ఆర్టీసీకి ఆదాయం పెరగనుంది. దూర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఇకనుంచి వారి కోరిక నెరవేరనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలకు కొత్త బస్సులను నడపనున్నారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన ప్రయాణికుల సదస్సులు, డయల్ యువర్ ఆర్టీసీలో వచ్చిన అభ్యర్థనలకు పరిష్కారం దొరకనుంది.ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన బస్సులు ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానంతో కూడుకొని ఉన్నాయి. దీనివల్ల కర్భన ఉద్గారాలు పరిమాణం తగ్గడం ద్వారా కాలుష్య పరిమాణం తగ్గనుంది. ప్రమాదాల నివారణలో భాగంగా వేగ నియంత్రికలను ఏర్పాటు చేశారు. దీనివల్ల బస్సు వేగం 80 కిలోవిూటర్లు మించితే డ్రైవర్ ప్రమేయం లేకుండానే ఎక్స్‌లేటర్ పడిపోతుంది. ఈ బస్సుల్లో బ్రేక్ విధానం విశిష్టమైనది. కేవలం ఒక్క సెకన్ వ్యవధిలో ఐదుసార్లు బ్రేక్ పడడం వల్ల కుదుపులు, పడిపోవటం వంటి సంఘటనలకు ఆస్కారం ఉండదు. కొత్తగా వచ్చిన లగ్జరీ బస్సుల్లో సీటింగ్ వ్యవస్థ కూడా ఇంద్ర బస్సులకు దీటుగా ఉంది. ప్రతి సీటు వద్ద ఫోన్ ఛార్జింగ్‌కు ఏర్పాటు ఉంది. లగేజి తీసుకెళ్లేవారి
సౌకర్యార్థం స్థలం ఎక్కువగా కేటాయించారు. ఎక్స్‌లేటర్, బ్రేక్ సిస్టంను సాంకేతికంగా మెరుగు పరచడం వల్ల ఈ బస్సును నడిపే డ్రైవర్‌కు సైతం ఈ విషయంలో శ్రమ తగ్గుతుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఇవి రావడంతో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి.