కొనసాగుతున్న ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సందర్భంగా ఆరోజును తెలంగాణ స్ఫూర్తి దినంగా జరుపుకోవాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఈకార్యక్రమానికి పలువురు తెలంగాణ నేతలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెలంగాణ వాదులు హాజరై విజయవంతం చేశారు.

వరంగల్‌లో స్ఫూర్తి దినం

తెలంగాణ స్ఫూర్తి దినం సందర్భంగా మానుకోటరాళ్ల దగ్గర కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పలువురు తెలంగాణ వాదులు పిండప్రదానం చేశారు. హన్మకొండ అమరవీరుల స్థూపం దగ్గర సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. భూపాలపల్లిలో సోనియా గాంథీ దిష్టిబొమ్మను శవయాత్రగా తీసుకెళ్లి ప్రధాన కూడలిలో దహన సంస్కారాలు నిర్వహించారు.

కరీంనగర్‌లో స్ఫూర్తి దినం

తెలంగాణ స్ఫూర్తి దినం సందర్భంగా జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలువురు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో స్ఫూర్తి

తెలంగాణ స్ఫూర్తి దినం సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో నగరంలోని నారాయణగూడలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ నేత నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సీపీఐ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. డిసెంబర్‌ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని, ఆనాటి నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు.

ఇందిరాపార్కు వద్ద బీజేపీ ధర్నా

డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనను అమలు చేయనందుకు నిరసనగా ఇవాళ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు  జరుగుతున్న తెలంగాణ స్ఫూర్తి దినం సందర్భంగా బీజేపీ దీక్ష చేపట్టింది. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న ఈ దీక్షా కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. జైతెలంగాణ నినాదాలతో ధర్నాచౌక్‌ దద్దరిల్లుతుంది.

తాజావార్తలు