కొనసాగుతున్న మహబూబ్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 1,439 ఓటర్లకుగానూ 1,437మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదిన కౌంటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 2వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగాఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో ఈసీ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ ముందు వరకు ఇరు పార్టీలు క్యాంప్ పాలిటిక్స్ రసవత్తరంగా సాగాయి. క్రాస్ ఓటింగ్ పై రెండు పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కౌంటింగ్ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్ పై 237 ఓట్లు చొప్పున లెక్కిస్తున్నారు.