కోట్లు ఉంటేనే సీట్లు

2014 ఎన్నికలకు తెలంగాణ ఉద్యమ పార్టీలు, సంఘాలు సంపూర్ణంగా సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఉద్యమం అంటే సీట్లు. 115+15 గెలిస్తే తెలంగాణ ఖాయం అని ఒక మత్తు మందుని ప్రజలపై చల్లుతున్నారు. నిజంగా సీట్లతోనే తెలంగాణ వస్తే చెన్నారెడ్డి హయాంలోనే వచ్చేదన్న విషయాన్ని మర్చిపోతు న్నారు ప్రజలు. మరిపిస్తున్నారు నాయకులు. ఒకవేళ గెలిచినా కాంగ్రెస్‌ పార్టీకీ, ఆంధ్రా పెట్టుబడిదారులకి ఈ బలహీను లైన తెలంగాణ నాయకులను లోబరుచుకోవడం అంతకష్టం కాదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమికరణాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని చెప్పక తప్పదు. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌ గెలిచిన కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలను చూస్తే డబ్బు ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధానసభకు ఎన్నికైన వారిలో సగానికిపైగా కోట్లకు పడగలెత్తినవారు. మిగిలిన సగంలో సగం మంది నేర చరితులే. అవును రాజకీయాల్లోకి రావాలంటే నేరాలు, ఘోరాలను తట్టుకోగల అగ్రనాయకుల అండదండలు కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అందరినీ కొనగలిగే డబ్బు ఎంతో అవసరమని ఎన్నికల చరిత్ర చెబుతోంది. ఇయితే ఇప్పుడున్నది ఒక ప్రత్యేక సందర్భం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ ఇస్తామనే పార్టీలు ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఇన్నాళ్లు మోసం చేసిన పార్టీలు ఇకపై తమ మోసం సాగబోదని తెలుసుకునే పరిస్థితి వచ్చిందని స్పష్టమవుతోంది. రాహుల్‌గాంధీ ఎంపీలతో మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు బయటికి రాలేక లోపల ఉండలేక ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు.తెలుగుదేశం దుకాణం తెలంగాణ లో ఖాళీ అవుతుంది. నిన్న గనుల(గుంగుల) కమలాకర్‌, నేడు కడియం శ్రీహరి. వీరిద్దరికీ ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఓన్లీ వెయ్యి మంది ఆత్మహత్యల తర్వాత చంద్రబాబునాయుడు తెలంగా ణపై స్పష్టమైన ప్రకటన చేయట్లేదని పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనే ఒక గొప్ప నిజాన్ని తెలుసుకొని పార్టీకి రాజీనామా చేశామని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది మరికొంత మందికి జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. వారిపట్ల ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కేసీఆర్‌ చెప్పినట్టుగా ఓ వ్యాఖ్య ప్రచారంలో ఉంది. డబ్బు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ఆయన చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. అవును నిజమే డబ్బులుం టేనే ఈ నేర రాజకీయాలను గెలువగలరు. నీతి, న్యాయం, ప్రజల పట్ల అంకితభావంతో పనిచేయడం ఇవన్నీ కాదు నాయకులను గెలిపించేవి. కేవలం డబ్బు అవి ఎవరి వద్ద ఉంటే వారే నాయకులు. వనరులను, ప్రజలను దోచుకున్న సొమ్ము ప్రత్యేకంగా కొన్ని కులాల వద్దే కేంద్రీకృతమైంది. నూటికో కోటికో తమ రెక్కల కష్టమ్మీద, విద్య, వైద్యం తదితర సేవలపై ఆధారపడి సంపాదిం చుకున్న కొద్ది మంది ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నా వారికి సీట్లు ఇచ్చే పార్టీ ఏదీ లేదు. పెట్టుబడిదారులు తెలంగాణ వనరులను దోచుకొని, ఇంకా దోచుకోవడానికి భూమిలో ఉన్న దాగి ఉన్న ఇనుప ఖనిజాన్ని కనిపెట్టారు. కరీంనగర్‌ జిల్లాలో ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయని ముందే గుర్తించిన కడప జిల్లాకు చెందిన ఓ రెడ్డి భీమదేవరపల్లిలో 150 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. దీనిని గురించి తెలంగాణ ఉద్యమం మాట్లాడదు. కేవలం బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అనుకుంటూ భీమదేవరపల్లి నుంచి ఉద్యమపార్టీ బస్సు యాత్రను ప్రారంభించనుంది. అంటే ఇక్కడ ఉన్న ఇనుప ఖనిజం నిల్వలు వెలికి తీయొచ్చని ఆ ఉద్యమ పార్టీ భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది కచ్చితంగా కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు వినాశనం కలిగించే చర్య. భీమదేవరపల్లి, వరంగల్‌ జిల్లా గూడురు వద్ద ఉన్న ఇనుప ఖనిజం నిల్వలు తీస్తే సమీప ప్రాంతాలు పర్యావరణ కాలుష్యంతో జీవించడానికి పనికిరాని విధంగా తయారవడం ఖాయం. తెలంగాణ ఉద్యమం వనరులను కాపాడే ప్రయత్నం చేయాలి. ఆంధ్రోళ్లు చేసిన పనినే తామూ కొనసాగిస్తామంటే అంతే కొంతో మిగిలి ఉన్న వనరులు ప్రైవేటుపరం అయి ప్రజలు వలస బాట పట్టే ప్రమాదముంది.    రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కావాల ని, ఇంకా కాంగ్రెస్‌ని బొందపెట్టాలని కేసీఆర్‌ అంటు న్నారు. కానీ చివరిక్షణంలో కాంగ్రెస్‌ ఏదో ఒక పనికిమాలిన ప్రకట న చేస్తుందేమో అని ఆ పార్టీ నాయకులు దింపుడుకళ్లం ఆశతో ఎదురుచూస్తున్నారు. మరికొందరు గోడమీది పిల్లుల్లాగ అటో ఇటో దూకడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా 0.5శాతం ఉన్న వెలమలకి 25 సీట్లు, రెండు శాతం ఉన్న రెడ్లకి 75 సీట్లు ఇస్తూనే ఉన్నారు. ఇలా చేస్తే సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ పదేళ్ల కింద నా బిడ్డా, కొడుకు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీ యాల్లోకి రారు అన్న మాటని ఎట్లా మరిచారు అని నిలదీస్తున్నారు. ఒకే కుటుంబంలో నుంచి, ఒకే కులం నుంచి అదికూడా దొరల, భూస్వామ్య కూలంలో నుంచి వచ్చి తెలంగాణలో నిలబడడం ఈసారి ఎన్నికల్లో పెద్ద సవాల్‌గా నిలువనుంది. తెలంగాణవాదం పక్కదారిపడుతుందా అనే అనుమానం కలుగుతుంది. ప్రాణాలకు తెగించి దొరల గడీలను కూల్చేసి, భూములని ప్రజలకు పంచామనుకుంటున్న ఉద్యమ శక్తులు, అదే దొరలూ గులాబీ కండువాలు కప్పుకొని భూ కబ్జాలు చేస్తుంటే గుండె రగిలి ఆవేశంతో, బాధతో మండి పడుతున్నారు.రేపటి తెలంగాణ అంటే అది కచ్చితంగా దొరల తెలంగాణ కాదు. ఇక్కడి వనరులను అమ్ము కునే తెలంగాణ కూడా కాదు. ఉద్యమమే ఇక్కడ ఉన్న వనరులని కాపాడి బహుజన కూలాలన్నింటికీ న్యాయం చేసేది. ఈ ప్రాంతం పాడిపంటలతో, పర్యావరణానికి నష్టంలేని గ్రామాధారిత పరిశ్రమ లతో పచ్చగా ఉండాలనేది. దీనిని పక్కనబెట్టి అంబేద్కర్‌ చెప్పినట్టు తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తారన్నట్టుగా ఆంధ్ర దొరలు పోయి తెలంగాణ దొరల గడీలు మళ్లీ మొలిచే ప్రమాదం ఉంది. దీనిని కచ్చితంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. తెలంగాణ బాప్తిజం తీసుకొని ప్రతి ఒక్క పార్టీ నుంచి జంప్‌ చేస్తున్న వారికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే, డబ్బున్న వారికళ్లా అమ్ముకుంటూ పొతే తెలంగాణ వచ్చే మాట ఏమోకాని, ఈ ప్రాంతం పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి మరింత అధ్వానంగా మారుతుంది. ఎన్నికలు తెలంగాణ కోసం అయితే అవి రాజకీయ పార్టీలు చూసుకుంటాయి కానీ జేఏసీ ఎందుకు నత్తనడక నడుస్తుందోనని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా జేఏసీ మారింద న్న వాదానికి బలం చేకూరినట్టు కూడా ఉంటుంది. ఇప్పటికైనా రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు కట్టుబడి ఉండే వ్యక్తులని రాజకీయాలలోకి తెస్తే వాటికి అర్థం ఉంటుంది లేదా మళ్లీ నేర చరిత్ర తిరగరాసే ప్రక్రియ మరోసారి 2014 నుంచి తెలంగాణ నాయకులతోనే మొదలవుతుంది.

– సుజాత సూరేపల్లి,

ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ రచయితల వేదిక.