కోతకు వచ్చిన పంటకు భారీ నష్టం
మార్కెట్లలో తడిసి ముద్దయిన పంట
నష్టం అంచనాకు రంగంలోకి దిగిన అధికారులు
కరీంనగర్,మే4(జనం సాక్షి): నాలుగు జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో కోతదశకు వచ్చిన పంట చేనులోనే తడిసింది. ఎంతమేర ధాన్యం నీటిపాలైందనే విషయమై అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పొలంలో కోసిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనావేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వానకు తడిసిపోయింది. సరైన రక్షణ చర్యలు లేకపోవడం టార్పలిన్ కవర్లను సంబంధిత అధికారులు అందివ్వకపోవడం వల్ల రైతులు పడరాని పాట్లు పడ్డారు. కొద్దిసేపు కురిసన వానవల్ల ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే ఆయా కేంద్రాల్లో ముంచెత్తిన వరద నీటిలోనుంచి ధాన్యపు గింజల్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాల్ని చవిచూసారు. కళ్లెదుటే రెక్కల కష్టం నీళ్లపాలవడాన్ని చూసిన అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. కరీంనగర్, హుజురాబాద్, పెద్దపల్లి, వేములవాడ, జమ్మికుంట మార్కెట్ యార్డులో ధాన్యం నింపిన సంచులు తడిసాయి. వీటితోపాటు మార్కెట్‌లో సరైన టార్పలిన్‌లు అందక నిల్వగా ఉన్న ధాన్యం తడిసింది. వీటితోపాటు సారంగాపూర్, సుల్తానాబాద్, ఇల్లందకుంట, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట, కోనారావుపేట, కమలాపూర్ మంథని గంగాధరతోపాటు పలు మండలాల్లో వాన సృష్టించిన నీటి కష్టం అపార నష్టాన్ని కలిగించింది. మరోవైపు ఉమ్మడి జిల్లా పరిధిలో వందకుపైగా ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు నేలవాలినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యానశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామపరిధిలో 5 ఎకరాల్లో మామడిపంటకు నష్టం వాటిల్లింది. రాయికల్ మండలంలో నేలరాలిన మామిడి కాయలను చూసి రైతులు ఆవేదన చెందారు. మానకొండూరు, కోరుట్ల మండలాల్లో ఈ రకమైన ఇబ్బంది పలు తోటల్లో కనిపించింది.