కోదండ రామ్ అరెస్ట్ ——- 


కరీంనగర్‌ నుండి ఖమ్మం-భద్రాద్రి వరకు రోడ్డు దిగ్బంధం
ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరి కాన్వాయ్‌లను అడ్డుకున్న
కోదండరామ్‌ సహా నిరసనకారుల, నాయకుల అరెస్ట్‌
కౌలు రైతులు, పోడు రైతులకు రైతు బంధు పథకం అందించాలి
గిట్టుబాటు ధరలు గ్యారంటీగా ఇవ్వాలి
2011 సాగుదారుల చట్టం అమలు చేయాలి
ఖమ్మం/కరీంనగర్‌,మే31(జ‌నం సాక్షి): తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సడక్‌బంద్‌లో భాగంగా ఆందోళన పాల్గొన్న ఆయన్ను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలపై తెలంగాణ రైతు సంఘాలు సడక్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖమ్మం నుంచి కరీంనగర్‌ వరకు ఆందోళనలు చేశారు. ఎల్కతుర్తి వద్ద కోదండరామ్‌ ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోదండరామ్‌తో పాటు ఆ పార్టీ నేతలు గాదె ఇన్నయ్య, వెంకట్‌రెడ్డి, సిపిఐ రాషట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్‌ నుండి ఖమ్మం-భద్రాద్రి వరకు 6 జిల్లాలలో రైతు సంఘాల రోడ్డు దిగ్బంధం కార్యక్రమం ఇరవై పైగా చోట్ల విజయవంతంగా జరిగింది. నిరసన కార్యక్రమాన్ని రైతు సంఘాలన్నీ ఉమ్మడిగా నిర్వహించాయి. దీనిలో అన్ని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో  పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పలు చోట్ల నిరసన కారులను, రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపుర్‌ వద్ద మంత్రులు ఈటెల రాజేందర్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కాన్వాయిని రైతులను ఆపేసారు. 100 మందికి పైగా  మహిళా రైతులను, రైతు నేతలను గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్ళారు. కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి వద్ద పాల్గొన్న తెలంగాణ జన సమితి అద్యక్షులు ప్రొ.కోదండరాం ని పోలీసులు అరెస్టు చేసారు. కొత్తగూడెంలో 200 మందికి పైగా పాల్గొనగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ని, అఖిల భారత రైతు కూలీ సంఘం నుండి కెచ్చెర్ల రంగయ్యని, అలాగే నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం నాయకురాలు పశ్య పద్మ ని మహబూబాబాద్‌ జిల్లాలో, తెలంగాణా రైతు సంఘం టి.సాగర్‌, జంగారెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం కొల్లేటి నాగేశ్వరరావుని అరెస్ట్‌ చేసారు. రైతు స్వరాజ్యా వేదిక నుండి విస్సా కిరణ్‌ కుమార్‌, బి.కొండల్‌, బీరం రాములు, తెలంగాణ రైతు సంఘం నుండి మోర్తాల చందర్‌ రావు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మచ్చాపూర్‌ గ్రామంలో  తెలంగాణ జన సమితి అద్యక్షులు ప్రొ.కోదండరాం, చాడా వెంకటరెడ్డి గార్లు  వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి  గ్రామంలో ; తెలంగాణా రైతు సంఘం నుండి టి.సాగర్‌, జంగారెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం నుండి అచ్యుతరామారావు, కొల్లేటి నాగేశ్వరరావు, తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం నుండి రామకోటయ్య, తెలంగాణ రైతు జె.ఏ.సి. నుండి పాపారావు ఖమ్మం పట్టణంలో  తిరుమలాయపాలెం మండలంలో;   తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం నుండి పశ్య పద్మ మహబూబాబాద్‌ జిల్లాలో, అఖిల భారత రైతు కూలీ సంఘం నుండి కెచ్చెర్ల రంగయ్య కొత్తగూడెం జిల్లాలో పాల్గొన్నారు. కేవలం 4 వేలతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం కావని నేతలు అన్నారు.  తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో రైతులు ఎంతో ఆశించినా, రైతు ఆత్మహత్యలలో దేశం మొత్తం విూద తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. కరువు సాయం, పంట నష్టం వచ్చినప్పుడు నష్టపరిహారం, సమయానికి బ్యాంకు రుణాలు అందజేయడం, పంట బీమా అమలు, పంటలకు సరైన ధరలు లభించడం, ప్రభుత్వ కొనుగోలు చెయ్యడం, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, భూసేకరణలో రైతాంగం హక్కులు కాపాడడం, దళితులకు భూ పంపిణీ, ఉపాధి హావిూ పథకం అమలు, నకిలీ విత్తనాలపై చర్యలు ఈ విషయాలన్నింట్లో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని రైతు సంఘాల నాయకులు అన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేలు ఇచ్చే పథకం తెచ్చి, కేవలం ఈ  4 వేలతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, రైతులు ఇక ప్రైవేటు అప్పుకి పోనక్కర్లేదని, దేశంలో ఎక్కడా ఇంత స్థాయిలో రైతులకు మద్దతు అందలేదని ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేస్తోంది. దీని వల్ల పట్టణాలల్లో, విదేశాలల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రమే లాభపడుతున్నారు కానీ వాస్తవసాగుదారులకు అందటం లేదని తెలిపారు. రైతు బంధులో పెట్టుబడి సాయం కేవలం భూమి పట్టా ఉన్న వారికే అందించడం అన్యాయమని, వాస్తవంగా సాగు చేస్తున్నవారందరికీ అందించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలను తెలియచేస్తున్న రైతులను, రైతు నాయకులను అరెస్టులు చేయటాన్ని రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఖండించాయి.