కౌలుదారుల రుణలక్ష్యం రూ.1.50 కోట్లు

ఖమ్మం, జూలై 19 : ఖమ్మం జిల్లా కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది 1.50 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు కొత్తగూడెం ఆర్డీఓ ధర్మారావు తెలిపారు. ఈ నెల 25 లోపు ఎట్టిపరిస్థితుల్లోను కౌలు రైతులందరికి రుణాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సిబ్బంది సర్వే చేసేటప్పుడు పలు విషయాలను ప్రమానికంగా తీసుకోవాలని సూచించారు. జుల్లూరుపాడు మండలంలో కేవలం 30మంది కౌలు రైతులు ఉన్నందున తహశీల్దార్‌, ఎంపిడిఓ, ఐకెపి ఎపిఓ, బ్యాంకు అధికారులతో మాట్లాడి వారికి బ్యాంకు రుణాలు ఇప్పించాలన్నారు. కౌలు రైతులకు రుణాలను నిరాకరించే బ్యాంకర్ల వివరాలను తనకు తెలియజేస్తే కలెక్టర్‌కు నివేదిస్తానన్నారు. కామేపల్లిలో 480 మంది, సింగరేణిలో 450 మంది, ఇల్లందులో 370 మంది వరకు కౌలు రౌతులు ఉన్నారని, కొత్తగూడెంలో 215, బయ్యారంలో 180 మంది వరకు కౌలు రైతులు ఉన్నారని ఆయన అన్నారు. ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్న చోట సకాలంలో రుణాలు ఇప్పించేందుకు దృష్టి సారిస్తామన్నారు.