క్షణికావేశంలో దారుణం

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): క్షణికావేశంలో భార్యభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో ఓ వ్యక్తి భార్యను రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటనతో ఆందోళనకు గురైన అతను వెంటనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరిశేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌ కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట మల్లయ్య(45), అతని భార్య రాధ(40) మధ్య గొడవలు రావడంతో కోపోద్రిక్తుడైన భర్త పక్కనున్న రోకలిబండతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భయాందోళనకు గురైన భర్త వెంటనే ఇంట్లోనే దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.