గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు
- ‘హాషిష్ ఆయిల్’పేరుతో మత్తు పదార్థాల విక్రయం
- తొలిసారి నిజామాబాద్ జిల్లాలో పట్టివేత
- ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
- వాడకందారుల్లో యువకులు,విద్యార్థులే అధికం
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా ఇతర ఏ జిల్లాల్లో లేని విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయితో పాటు ద్రవరూపంలో ఉన్న గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేశారు. ‘హాషిష్ ఆయిల్’ను పోలీస్ టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిర్వహించిన దాడుల్లో పట్టుకున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్రతో కలిసి వివరాలను మంగళవారం వెల్లడించారు. మలావత్ కిశోర్‌మెహన్, మలావత్ దర్బా ర్, జట్వే మాన్‌సింగ్, ఆకుల అజయ్, సుధీర్ అనే ఐదుగురు కలిసి గంజాయితో తయారు చేసిన హాషిష్ ఆయిల్(మత్తు పదార్థం)ను విద్యార్థులు, యువకులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేసే ఖజాబీ (60) అనే మహిళను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ హాషిష్ ఆయిల్‌ను ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కూ డా పట్టుకొలేదని సీపీ నాగరాజు పేర్కొన్నారు. గతంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ ముఠాను అరెస్టు చేసిన బృందాలను ఆయన అభినందించారు. అదనపు డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, ఎక్సైజ్ సీఐ వేణు మాధవ్, రెండో టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్, ఎక్సైజ్ ఎస్సై రామ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ చందులాల్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ టీమ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సభ్యులు దాడిలో పాల్గొన్నారని సీపీ వెల్లడించారు. వీరందరిని ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులను అందజేశారు.
ఒక్క లిక్విడ్ బాటిల్ విలువ రూ.2 వేలు..
గంజాయితో తయారు చేసే ఈ హాషిష్ ఆయిల్ చిన్న బాటిల్ విలువ రూ.2 వేలు ఉంటుంది. ఒక్క బాటిల్‌లో సుమారు 5 నుంచి 7 ఎంఎల్ మాత్రమే ఉండే గంజాయి లిక్విడ్‌కు యువకులు బానిసలుగా మారిపోతున్నారు. లిక్విడ్‌ను సిగరెట్ పైన పూసుకొని సేవిస్తారు. ఈ ఒక్క బాటిల్ గంజాయి ఆయిల్ 10 నుంచి 12 సిగరెట్లకు వస్తుందని విచారణలో తేల్చారు.
జాయింట్/ సెక్షన్ కోడ్ భాష లో హాషిష్’ సేవనం..
రెండు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన గంజాయి లిక్విడ్‌ను సిగరెట్‌పై రాసుకొని సేవించేందుకు మత్తుబాబులు కోడ్‌భాష వాడుతారు. గంజాయి లిక్విడ్ సిగరెట్‌ను ఇద్దరు కలిసి సేవిస్తే దాన్ని ‘జాయింట్’ అనే కోడ్‌తో పిలుస్తారు. ‘జాయింట్‌గా కొడదాం’ వస్తావా అని చెప్పుకుంటారు. అదే ముగ్గురు నుంచి ఆరుగురు వరకు కలిసి సేవిస్తే దాని ‘సెక్షన్ కొడదాం వస్తారా’అంటూ ఈ మత్తు సేవిస్తారు.
40 లిక్విడ్ బాటిళ్లు, 700 గ్రాముల గంజాయి సీజ్
పట్టుబడిన ఈ ఐదుగురు నిందితుల వద్ద నుంచి 40హాషిష్ లిక్విడ్ బాటిళ్లతో పాటు 700 గ్రాముల ఎండు గంజాయి సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. దీని విలువ రూ.లక్షా20వేల వరకు ఉంటుందన్నా రు. దీంతో పాటు వారి వద్ద నుంచి రెండు బైకులు, 4 సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
ఒక్కో నిందితుడి సెల్ ఫోన్‌లో వంద మంది నంబర్లు
పట్టుబడిన ఐదుగురి సెల్‌ఫోన్లను పరిశీలిస్తే పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఒక్కో గంజాయి విక్రయదారుని సెల్‌ఫోన్‌లో వారి వద్ద నుంచి సరుకు(మాల్) కొనుగోలు చేసే స్టూడెంట్స్, యువకులకు సంబంధించి సుమారు వంద మంది సభ్యుల నంబర్లను గుర్తించారు. మొత్తంగా 500 మంది ఈ గంజాయి లిక్విడ్ సేవించడంలో బానిసలుగా మారినట్లు గుర్తించామని పేర్కొన్నారు. వారందరిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సీపీ నాగరాజు వెల్లడించారు.