గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి.
పెద్దకొత్తపల్లి ఎస్సై రాము.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 28(జనంసాక్షి):
పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల ఏర్పాటుకు ఆయా కమిటీలు కచ్చితంగా అనుమతులు పొందాలని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ముందస్తుగా గ్రామంలో శాంతి కమిటీ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక ఉత్సవాలను భక్తితో, జరుపుకునేందుకు కమిటీలు శ్రద్ధ చూపాలని కోరారు.కమిటీ ఏర్పాటు అనంతరం ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అనుమతి తీసుకోవాలని,మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు.విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ నుంచి, సౌండ్ మరియు మైకుల ఏర్పాటు కోసం పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు.మండపాల వద్ద డిజె సౌండ్ సిస్టం, బూర గొట్ట మైకులకు అనుమతి లేదని కేవలం రెండు సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు.రాత్రి పది గంటల తర్వాత గణేష్ మండపాల దగ్గర మైకులు, సౌండ్ బాక్స్ లు మరియు వివిధ రకాల సౌండ్లు పెట్టకూడదని తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాల ఏర్పాటు కోసం ముందస్తుగా పోలీస్ శాఖకు తగు సమాచారం అందించి, అనుమతులు పొందిన తర్వాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.ఆన్లైన్ అప్లికేషన్ మసేవ లేదా ఈ సేవ రషీద్, విద్యుత్ శాఖ పర్మిషన్ లెటర్, స్థల యజమాని అనుమతి పత్రం, గ్రామపంచాయతీ పర్మిషన్ పత్రాలను పోలీస్ స్టేషన్లో అందజేసి అనుమతి తీసుకొని కమిటీ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.అంతే గాక గణేష్ మండపం వద్ద ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటర్ డ్రమ్ములు, ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.గణేష్ విగ్రహం వద్ద రాత్రి సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.