గర్భిణులను క్షేమంగా వాగు దాటించిన అధికారులు

మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలింపు

పలిమెల, జులై 11 (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలిమెల మండలానికి సంబంధాలు తెగిపోయాయి. పెద్దంపేట వాగు వద్ద వరద తాకిడికి అప్రోచ్ రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని లెంకెలగడ్డ, సర్వాయిపేటకు చెందిన గర్భిణులకు పురిటి నొప్పులు రావడంతో కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దీంతో స్పందించిన కలెక్టర్ భావేశ్ మిశ్రా, అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పెద్దంపేట వాగు వద్దకు చేరుకున్నారు.
వైద్య సిబ్బంది మొదట వాగు దాటి పరీక్షలు నిర్వహించిన అనంతరం లెంకలగడ్డకు చెందిన మడప పుష్పలత, సర్వాయిపేటకు చెందిన పాగే రాధిక అనే ఇద్ద‌రు గర్భిణుల‌ను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఎన్‌డీఆర్ ఎఫ్‌ బృందం, స్థానిక ప్రజలతో కలిసి వారిని సురక్షితంగా పెద్దంపేట బ్రిడ్జి దాటించి మహాదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు