నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే కాళేశ్వరంలో సమస్య
` రీసెర్చ్ ఇంజినీర్లు
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు.శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది.నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజినీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణం చేపట్టారని, నీటిని భారీగా నిల్వ చేయడం కారణంగానే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని వారు పేర్కొన్నారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం వల్ల సమస్యలు వచ్చాయన్నారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీల్లో సమస్యలు, మోడల్ స్టడీస్‌కు సంబంధం లేదని వివరించారు.నిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్‌ఎల్ పని చేసిందని కమిషన్ ఎదుట ఇంజినీర్లు పేర్కొన్నారు. లొకేషన్, సీడీఓ అథారిటీ నివేదికల ఆధారంగా రీసెర్చ్ చేశామని, మొత్తం మూడు బ్యారేజీల్లో 2016 నుంచి 2023 వరకు రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో మోడల్ స్టడీస్ జరిగినట్లు వివరించారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి సమాధానాలు ఇచ్చారు. కమిషన్ ఎదుట సమాధానం ఇచ్చే విధానం సరికాదని జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. పని చేసిన సమయంలో ఏమి గుర్తుకు ఉందో అదే చెప్పాలన్నారు. చాలా విషయాలు గుర్తుకు లేదు, మర్చిపోయానని శ్రీదేవి తెలిపారు.