సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు సత్యనారాయణ రెడ్డి — సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, (జనంసాక్షి) : సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం మాజీ చైర్మన్, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ ఉపాధ్యక్షుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రస్తుత, గత పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, సత్యనారాయణ రెడ్డి ఎస్సారెస్పి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా పనిచేసి కాలువ లైనింగ్ పనులు చేపట్టి మంథని ప్రాంతంలోని టేలెండ్ ప్రాంతాలకు నీరందించిన ఘనత సత్యనారాయణదేనని అన్నారు. రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సత్యనారాయణ రెడ్డి అని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన సమయంలో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో సింగిల్ విండో చైర్మన్, కెడిసిసి బ్యాంక్ ఉపాధ్యక్షులుగా ఎన్నికై మంథని ప్రాంత రైతులకు సంఘం ద్వారా వివిధ రకాల రుణాలు అందించడం జరిగిందని అన్నారు. అంతేగాకుండా పెంకుటిల్లులో ఉన్న సంఘ కార్యాలయానికి సత్యనారాయణ రెడ్డి, అప్పటి పాలకవర్గం సమిష్టి కృషితో పక్కా భవన నిర్మాణం కోసం డిసిఎంఎస్ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి కార్యాలయ భవన నిర్మాణం, గోదాం నిర్మాణం చేపట్టారని అన్నారు. అంతేగాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారం తో సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించడానికి కేంద్రాల మంజూరు తీసుకువచ్చి విజయవంతంగా నిర్వహించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులకు ఎరువుల కొరత లేకుండా తీర్చిన ఘనత సత్యనారాయణ రెడ్డి దని అన్నారు. అలాగే సత్యనారాయణ రెడ్డి హాయాంలో వెంకటాపూర్ లో గోదాం నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. సత్యనారాయణ రెడ్డి స్ఫూర్తిని తమ పాలకవర్గం కొనసాగిస్తూ రైస్ మిల్లర్ల దోపిడి నుంచి రైతులను కాపాడేందుకు నాగారం గ్రామ శివారులో రైస్ మిల్లు నిర్మాణానికి భూమి కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. వివిధ శాఖాపరమైన అనుమతులు రాగానే రైస్ మిల్లు నిర్మాణం చేపట్టి కస్టమ్ మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి సరఫరా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత, గత పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముందుగా రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, దేవళ్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్లి రమ-సురేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మూల సరోజన, ఏఎంసి మాజీ చైర్మన్లు అజీంఖాన్, ఆకుల కిరణ్, సంఘ మాజీ ఉపాధ్యక్షుడు కూర కోటేష్, మాజీ డైరెక్టర్లు గూడ రాజిరెడ్డి, మెట్టు నోమారెడ్డి, రయీస్ అహ్మద్, గూడెపు శ్రీనివాస్, నాయకులు గుండా పాపారావు, బెజ్జంకి డిగంబర్, మంథని విజయ్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.