యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం నిర్వహిస్తున్నది. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం కొనసాగుతున్నది. దోష నివారణ ఆలయ యాగశాలలో ఉదయం 6 గంటలకు ప్రారభమైన హోమం 10 గంటలకు ముగియనుంది. హోమంతోపాటు అన్ని పోటుల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు. వాస్తు యాగం అనంతరం లడ్డూపోటు, విక్రయాశాలలో వాస్తు శుద్ధి చేయనున్నారు.

విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహా క్రతువు కొనసాగుతున్నది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహిస్తున్నారు. సమస్త దోష పరిహారం, సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో టీటీడీ ఈ యాగం ఏర్పాటు చేసింది. లడ్డూ పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. హోమం తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. కాగా, లడ్డూ పవిత్రత దోష పరిహారం కోసమే యాగం నిర్వహిస్తున్నామని అర్చకులు అన్నారు. సందేహాల నడుమ ముందుకు సాగలేమని, అందుకే శాంతియాగం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు చెప్పారు.

తాజావార్తలు