గాంధేయవాద పార్టీ జుడుం జులుంను ఎలా సమర్థిస్తోంది?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో సల్వజుడుం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. ముక్కుపచ్చలారని బాలలకు ఆయుధాలిచ్చి తోటి గిరిజనులపై యుద్ధానికి ఉసిగొల్పింది. కేవలం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో సల్వజుడుం ఎస్పీవో (స్పెషల్‌ పార్టీ పోలీస్‌)లు దండకారణ్యం సాగించిన నరమేధం సభ్య సమాజం నివ్వెరపోయేలా చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ కాంగ్రెస్‌(ఐ). ఇది భారత స్వతంత్ర సమరంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీకి దాదాపు నఖలు. అసలు కాంగ్రెస్‌ స్థానే.. ఆ పార్టీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌(ఐ) నేతలు మాట్లాడే సందర్భంలో తమ పార్టీది 120 ఏళ్లకు పైబడిన చరిత్ర అని చెప్తుంటారు. ఇప్పటి కాంగ్రెస్‌(ఐ)కి నాయకత్వం వహిస్తున్న వారు నెహ్రూ వారసులు. గాంధీ పేరును తమ ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రతి సందర్భంలో తమ పార్టీ గాంధేయ మార్గాన్ని అనుసరిస్తుందని చెప్తుంటారు. అలాంటి పార్టీకే చెందిన మహేంద్రకర్మ అభివృద్ధి నీడైనా సోకని గొత్తికోయలు, ఆదివాసీలకు వ్యతిరేకంగా సల్వజుడుం పేరుతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఛత్తీసగఢ్‌లో నిక్షిప్తమైన ఉన్న అపార సహజ వనరులు, ఖనిజ సంపద వెలికితీత, తరలింపునకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టు పార్టీకి గొత్తికోయలు, ఆదివాసీలు సహకరిస్తున్నారనే నెపంతో వారిపై సల్వజుడుం సాగించని అకృత్యం లేదు. అయినా తమది గాంధేయ మార్గమని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ ఏమిటివి అని ప్రశ్నించలేదు. పాలకులు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నది మావోయిస్టులు, వారికి సహకరిస్తున్నది ఆదివాసీలు అనేక ఏకైక ఎజెండాతో సాగిస్తున్న నరమేధానికి సహకారం అందించింది. యూపీఏ`1 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే సల్వజుడుం పురుడుపోసుకుంది. ఆ పార్టీ సీఎల్పీ నేతగా ఉన్న మహేంద్రకర్త సల్వజుడుంకు కర్త, కర్మ, క్రియ. మావోయిస్టులకు వ్యతిరేకిని అని చెప్పుకునే కర్మ ఆ పేరుతో దండకారణ్యంలో గొత్తికోయలు, ఆదివాసీలకు మనుగడ లేకుండా చేయాలని చూశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో గొత్తికోయలు, ఆదివాసీల గృహ దహనాలకు పాల్పడ్డారు. మహిళలపై సామూహిక అత్యాచారాలు చేశారు. ప్రశ్నించిన ప్రతి గొంతుకనూ తెగ్గోశారు. ఇంతటి నరమేధం జరుగుతున్నప్పుడు గాంధేయవాది పార్టీ కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించాలన్నా, పార్టీలో, ప్రభుత్వంలో ఆర్థికంగా బలపడాలన్నా కార్పొరేట్ల అండదండలు ఎంత అవసరమో గుర్తించిన కాంగ్రెస్‌ వారికి దండకారణ్యంలోని సహజ వనరులు దోచి పెట్టేందుకు ముందడుగు వేసింది. ఈ ప్రయత్నానికి అడ్డు తగులుతున్న మావోయిస్టులు, ఆదివాసీలను అడ్డుతొలిగించుకునేందుకు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో వేట ప్రారంభించారు. దండకారణ్యంలోని అభూజ్‌మడ్‌ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు ఇప్పుడు ప్రభుత్వం పారా మిలటరీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా తదితర బలగాలను రంగంలోకి దించింది. దండకారణ్యంలో తిష్టవేసిన ఈ బలగాల చేతిలో మాన ప్రాణాలు కోల్పోయిన, కోల్పోతున్న గిరిజనులు కోకోల్లలు. ఇంత జరుగుతున్నా గాంధేయవాద పార్టీకి ఇసుమంతైనా విచారం కలుగలేదు. తమ ఏలుబడిలో ఇంతకాలం కనీస పౌర హక్కులకు నోచుకోని ఐదో శ్రేణి పౌరులుగా దండకారణ్యంలో జీవనం సాగించే అమాయక ఆదివాసీలను మనుషులుగా గుర్తించలేదు. అహింసే తమ మార్గమని చెప్పే కాంగ్రెస్‌ పార్టీ సల్వజుడుం, పోలీసు బలగాల అకృత్యాలను ఎలా ఇంతకాలం సమర్థించింది. ఇంకా సమర్థిస్తోంది. ఎవరి మేలు కోసం ఆ పార్టీ తాపత్రయ పడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తన మూల సిద్ధాంతాల నుంచి పక్కకుపోయింది అనుకోవాలా? అదే నిజమైతే తమ పార్టీ విధానం మార్చుకున్నట్టు ప్రకటించాలి. గాంధేయ మార్గం తమ అభిమతం కాదని, హింసామార్గమే తమ విధానమని చెప్పుకోవాలి. మహేంద్రకర్మ, నందకుమార్‌ పటేల్‌ హత్యను ఖండిరచినట్టుగానే ఆదివాసీలపై జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహ దహనాలను ఖండిరచాలి. హింస ఏ రూపంలో జరిగినా దానిని ఖండిరచాలి. అందుకు ప్రేరేపించిన శక్తుల తీరును, వ్యవహారాన్ని ఖండిరచాలి. కాంగ్రెస్‌ పార్టీ ఇంతకాలం గొత్తికోయలు, ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలపై నోరెత్తి మాట్లాడలేదు. ఇప్పుడు మావోయిస్టుల చర్యను ఖండిరచడం ద్వారా తమ పార్టీ మూల సిద్ధాంతాలను మార్చుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పకనే చెప్పినట్టయింది. అభివృద్ధి పేరుతో అమాయక ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేయాలనే ప్రయత్నానికి జాతీయ స్థాయిలో అధికార, ప్రతిపక్ష కూటములకు నేతృత్వం వహిస్తున్న పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నాయి. ఇదే ప్రజాస్వామ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా ప్రజల పక్షం వహించాలి. కార్పొరేట్లకు మేల్లు చేకూర్చేందుకు అమాయక ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి.