గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా తాయిలాలు…?
ఏటా దేశంలో రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఇతరత్రా తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం చేస్తున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని..మార్కెట్‌కు తీసుకుని వచ్చిన పంటలను సకాలంలో కొనుగోలు చేయాలన్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ప్రధానంగా కంది, మిర్చి, పత్తి, ఎర్రజొన్న, పసుపు రైతులు బాధలు వర్ణనాతీతం. 24 గంటల ఉచిత విద్యుత్…నీటి సరఫరా, రైతుబందు కింద పెట్టుబడి సాయం…రైతు చనిపోతే కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకం అమలవు తున్నాయి. మిషన్ కాతీయ తదితర పథకాలతో చెరువుల్లో నీరు పెరిగి పంటల దిగుబడి పెరిగిందని ప్రభుత్వమే చెబుతోంది. ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టి పంటలు కొనుగోలు చేయకపోతే ఎలా? పంటలు అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కితే రాజకీయం ఎలా అవుతుంది.? గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, పంటలు కొనుగోలు చేయాలని కోరుకోవడం షరా మామూలుగా మారింది. ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. సీజన్‌లో సకాలంలో పంటలు కొనుగోలు చేసి డబ్బులు ముట్టచెప్పితే చాలు.. రైతు సమస్యలు సగం తీరినట్లే. కానీ మార్కెట్ యార్డుల్లో పడిగాపులే రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. దానికితోడు గిట్టుబాటు ధరలు రావు. అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పుడు కొనుగోళ్ల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పెద్దగా కార్యాచరణ చేపట్టలేదు. పంట ఏదైనా డిమాండ్ ఉండదు. అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సిందే. రైతుబంధు కోసం బడ్జెట్‌లో 12వేల కోట్లు కేటాయించిన సిఎం కెసిఆర్ కూడా పంటల కొనుగోళ్లకు మాత్రం హావిూ ఇవ్వడంలేదు. కెసిఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధును ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం కూడా పంటల కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట విధానాలు అమలు చేయడం లేదు. మార్క్‌ఫెడ్, సిసిఐలు రంగంలోకి దిగినా ఫలితం దక్కడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్ అంటూ అట్టహాసంగా ప్రకటనలు చేసినా రైతులకు మేలు చేకూర్చలేదు. పంటలను గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏటా రైతులు రోడ్డెక్కడం మామూలు విషయంగా మారింది. గిట్టుబాటు ధరలతో పాటు కొనుగోళ్ల కోసం పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌కు ప్రజావాణిలో విన్నవించినా, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందజేసినా రైతుకు భరోసా దక్కడం లేదు. ఇప్పుడు వరి,పత్తి, సోయా తదితర పంటలు మార్కెట్‌కు వచ్చే కాలం. ఈ సమయంలో పక్కాగా కొనుగోళ్లు సాగాలి. ధరలు దక్కాలి. దళారుల మోసాలు అరికట్టాలి. ఏటా పంట ఏదయినా జిల్లాల్లో పండించిన పంటలను కొనే దిక్కు లేకుండాపోయింది. గతేడాది పూర్తిస్థాయిలో రైతుల వద్ద కందులు కొనాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ అర్ధంతరంగా చేతులెత్తిసింది. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన పంటకు కూడా నాణ్యత ప్రమాణాల పేరిట ఇబ్బందులకు గురి చేసిన మార్క్‌ఫెడ్ ఇక నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కందులను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్ముకుని నష్టపోయారు. కంది పంటను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు రైతుకు కూడా డబ్బులు సకాలంలో చెల్లించలేదన్నారోపణలు ఉన్నాయి. దీంతో కార్యాలయం చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. పంటను కోసిన కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అవస్థలకు గురవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. రోజులు గడుస్తున్నా అధికారులు డబ్బులు మాత్రం
అకౌంట్‌లో జమ చేయకపోవడంతో రైతులు బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడాల్సి వచ్చింది. కంది,మిర్చి రైతులు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్, ఖమ్మం మార్కెట్లలో మిర్చి రైతులు అవస్తలు చూస్తే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మిర్చి ఉత్పత్తి పెరిగినా గిట్టుబాటు కాలేదు. ఏటా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోళ్లు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి. మరోవైపు మార్కెటింగ్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరట్లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కందులు, మొక్కజొన్నలకు ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడం, పౌరసరఫరాల శాఖ, సీసీఐ బకాయిల చెల్లింపు పక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలన్నీ కూడా అదనపు ఆటంకాలుగానే మారాయి. కందులు, మొక్కజొన్న పంటలకు ఒకశాతం మార్కెట్ ఫీజు మినహాయింపు నివ్వడం, పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెటింగ్ ఆదాయంపై గట్టి ప్రభావం పడింది. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ, కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజలో ఉంది. కొన్ని గోదాములను ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తుండగా, అత్యధిక గోదాముల్లో పౌరసరఫరాల శాఖ వారి ధాన్యం, సీసీఐ వారి పత్తిని నిల్వ ఉంచారు. వీటి ద్వారా రావాల్సన ఆదాయ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇదంతా కేవలం పక్కా మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, భారీగా పండుతున్న పంటలను కొనుగోలు చేసే వ్యూహం ప్రదర్శించడం లేదు. పంటల కొనుగోలు సమయంలో సరైన వ్యూహంతో ప్రభుత్వాలు చర్య తీసుకుంటే ఇబ్బందులు రావు.