గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 10 : హైస్కూల్‌, ఇంటర్‌ సమస్యలను, ఫీజులను అరికట్టాలని, గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ నగరంలో గుర్తింపు లేని పాఠశాలలు వందకు పైగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్దంగా పాఠశాలలు నడుపుతున్నారన్నారు. ఫీజులను విపరీతంగా వసూళ్లు చేయడమే కాకుండా డొనేషన్లు తీసుకుంటున్నారని వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని , ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 30లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటే ఇప్పటికి 10లక్షలు మాత్రమే వచ్చాయని, ఇంగ్లీష్‌ మీడియం పాఠ్యపుస్తకాలు మాత్రం ఇంకా ఇప్పటికీ ముద్రణ పూర్తి కాలేదన్నారు. 3,6,7 తరగతులకు ఇంకా పుస్తకాలు రాని స్కూళ్ళు వందకు పైగానే ఉన్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మూత్రశాలలు, తాగునీరు, ఏర్పాటు చేస్తూ ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇంటర్మీడియట్‌ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా, విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో సెక్షన్‌లను ఎత్తివేయాలని చూస్తుందన్నారు. ముందు మౌలిక వసతులు, లెక్చరర్స్‌ కొరత,ల్యాబ్స్‌, లైబ్రరీ ఏర్పాటు చేసి ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తయారు చేసినప్పుడు ప్రభుత్వ కళాశాలలకు ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. ఇంటర్‌ సెక్షన్‌ల ఎత్తివేత ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్స్‌, టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు రవికుమార్‌, అన్వేష్‌, విజయ్‌, చరణ్‌, రాజు, నవీన్‌, సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినయ్‌, రమేష్‌, నవీన్‌, సాయి, కృష్ణ,జబ్బర్‌ తదితరులు పాల్గొన్నారు.