గోదావరి నీటివాటాను సంపూర్ణంగా వినియోగించుకుందాం

C

– ప్రాజెక్టుల డిజైన్‌ మార్చాలి

– రెండుగా ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్ట్‌

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి):

గోదావరి జలాల్లో తెలంగాణకు 935 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని,  నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 453 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టులే ఉన్నాయని, మరో 521 టీఎంసీల నీరు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఇక్కడి సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, ఆ శాఖ అధికారులు, వ్యాప్కో ప్రతినిధులతో గోదావరిపై తలపెట్టిన ప్రాజెక్టులపై సీఎం సవిూక్ష నిర్వహించారు. తెలంగాణకున్న హక్కుల మేరకు గోదావరి జలాలను వినియోగించుకునే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని కేసీఆర్‌ సూచించారు.

అదేవిధంగా అదిలాబాద్‌లో నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్‌ చేయాలని, ప్రాజెక్టును రెండు భాగాలుగా నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తుమ్మిడిహట్టి దగ్గర ఓ ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌కు, కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మించి నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలకు నీరందిద్దామని కేసీఆర్‌ సవిూక్షలో సూచించారు. గోదావరి బేసిన్‌ పరిధిలో సగటున లక్ష ఎకరాల చొప్పున సాగునీరందాలని, 54కు నియోజకర్గాలకు గాను 50 నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున సాగునీరందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్నారు. ఎస్సారెస్సీ, నిజాంసాగర్‌, కడెం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వివరించారు. మిగతా 40 లక్ష ఎకరాలకు 400 టీఎంసీలు అందించేలా చర్యలు తీసుకోవాలని సవిూక్షలో నీటిపారుదల శాఖకు సీఎం సూచించారు.

దీంతోపాటుగా వరంగల్‌ జిల్లాలోని కంతనపల్లి ప్రాజెక్టు స్థలం మార్పునకు కేసీఆర్‌ ప్రతిపాదించారు. దేవాదుల ప్రాజెక్టుకు 170 రోజులు లిఫ్ట్‌ చేయాల్సి ఉన్నా 90 రోజులు కూడా నీటిని లిప్ట్‌ చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. కంతనపల్లిని కొద్దిగా దిగువన నిర్మిస్తే దేవాదులకు ఉపయోగం ఉంటుందని కేసీఆర్‌ వివరించారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రీడిజైనింగ్‌ చేయాల్సింది సీఎం సూచించారు. అన్ని ప్రాజెక్టుల డిజైనింగ్‌ బాధ్యతను వ్యాప్కోకు అప్పగిస్తూ సవిూక్షలో నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదీ జలాల నీటిని సంపూర్ణంగా వినియోగించుకునే ప్రాజెక్టుల నమూనాలను సిద్ధం చేయాలని సీఎం, వ్యాప్కో ప్రతినిధులను ఆదేశించారు.