గౌరవెళ్లి పునరావాసానికి ఆమోదం 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): శ్రీరాంసాగర్‌ వరద కాలువ నిర్మాణంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఉద్దేశించిన ‘గౌరవెళ్లి’ నిర్మాణానికి
2007లో శంఖుస్థాపన చేశారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన తర్వాత పునరావాసం ప్యాకేజీ విషయంగా పనులు నిలిచిపోయాయి. మంత్రి ఈటెల చొరవతో ఎట్టకేలకు హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెళ్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరావాస సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ విషయంలో శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌, భూసేకరణ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. నిర్వాసితులు రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. రిజర్వాయరు నిర్మాణంతో గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని 937 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. వీరికి రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు
జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 937 కుటుంబాలకు రూ.74.96 కోట్ల మేర పరిహారం అందనుంది. పునరావాస సమస్యకు పరిష్కారం లభించడంతో ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.గత కొంతకాలంగా రిజర్వాయరులో ముంపునకు గురవుతున్న గుడాటిపల్లిలోని కుటుంబాలు.. తగిన పునరావాసం, పరిహారం కోసం ఆందోళన చేస్తున్నాయి. పునరావాస పరిహారం ఇచ్చిన తర్వాతనే రిజర్వాయరు పనులకు సహకరిస్తామని గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రిజర్వాయర్‌ను సందర్శించి.. 1.45 టీఎంసీ సామర్థ్యం నుంచి 8.5 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో అదనంగా మరో 1800 ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. ఈ  నేపథ్యంలో నిర్మాణానికి అవసరమైన భూముల సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ 200 రోజులుగా గుడాటిపల్లిలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. 123 జీఓ ప్రకారం భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నించగా నిర్వాసితులు వ్యతిరేకించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాస కాలనీ నిర్మాణం కోసం గౌరవెళ్లి, కుందనవానిపల్లి, జనగామ గ్రామాల మద్య స్ధల పరిశీలన చేసి ఎంపిక చేశారు.