గ్రామస్థులు చేతులు కలిపితే ఎర్రవల్లి బంగారువల్లి

c

– ఊరు బాగుకు అందరూ నడుం బిగించాలి

– మరో అంకాపూర్‌ కావాలి

– గ్రామాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌

గజ్వెల్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):

గ్రమస్థులంతా చేయిచేయి కలిపితే ఎర్రవల్లి బంగారువల్లి అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గంగదేవిపల్లిని,అంకాపూర్‌ను సందర్శించినట్లు ఎర్రవల్లిని చూడడానికి ప్రజలు రావాలని అన్నారు.  గ్రామస్థులంతా నడుం బిగిస్తే గ్రామంలో అపరిశుభ్రత ఉండదని సిఎం   పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లిలో గురువారం నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ… తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే ఎర్రవల్లి గ్రామమని… అందరూ కష్టపడితేనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. అందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చుకోవాలని సూచించారు. ఈ గ్రామం బంగారు తునక కావాలంటే అందరూ కలసి నడవాలన్నారు. రాజకీయాలు పక్కన పెట్టిన ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఊళ్లో రోడ్లు, చెట్లు, కాలువలు శుభ్రంగా ఉండాలని, అందుకు గ్రామస్థులు కలసి బాగు చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులున్నా… ఎర్రవల్లి గ్రామం ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకుంటామని… అలాగే మన గ్రామాన్ని మనమే శుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని.. ప్రజలతోనే ఉండి గ్రామ పరిశుభ్రతకు తాను కూడా కూలి పని చేస్తానన్నారు. అందరూ కలిసి చర్చించుకుని పని విభజన చేసుకుని గ్రామంలో చెత్త తొలగించి.. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రోడ్లు ఎలా ఉండాలో, ఎక్కడ కాలువలు ఉండాలో సరిచేసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే పనులు వస్తాయని, మనం చేఉకునే పనులు చేసుకోవాలని అన్నారు. ఎర్రవల్లి నా సొంత ఊరు. రెండు వేల చేతులు రెండు గంటలు పని చేస్తే ఎర్రవల్లిలో మురికి ఉండదు. ఎర్రవల్లిలో ఇండ్ల పరిస్థితి బాగాలేదు. ఎర్రవల్లి గ్రామం నుంచే తెలంగాణ తెచ్చిన. కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం.. కలిసి గ్రామాల బాగు చేసుకోలేమా అని ప్రజలను ప్రశ్నించారు. అందరం చెత్త తొలగించేందుకు తయ్యారేనా అని అడిగారు. సరే అన్నోళ్లంతా చేతులెత్తాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా వారికి వివరించారు. డబ్బులు ఖర్చులు అవుతున్నా.. గ్రామాల్లో పరిస్థితి మారటం లేదని,  కొదిపాటి ఓపిక, అవగాహన ఉండాలన్నారు.  ఎర్రవల్లి గ్రామం తెలంగాణలోనే నంబర్‌ వన్‌  గ్రామం కావాలని ఆకాంక్షించారు. రేపు జెసిబిలను పిలిపిస్త…నాలుగైదు ట్రాక్టర్లను పిలిపిస్తా..అందరం కలసి గ్రామాన్ని బాగు చేసుకుందామని అన్నారు.  ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తాం. ఎర్రవల్లిలో 200 డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కట్టిస్తాం. చాలా ఇళ్లకు తోవలు కూడా సరిగా లేవు. ఐకమత్యంగా పని చేస్తే సాధ్యం కానిదేది లేదు. రోడ్లు అన్నీ పద్ధతిగా ఉండాలన్నారు. ఇక్కడి నుంచి గణేశ్‌ పల్లి వరకు నాలుగు లైన్ల రోడ్లు వేస్తున్నామని చెప్పారు. రేపు అందరం కలిసి ఊరును శుభ్రం చేద్దాం. నా వంతుగా వంద తట్టలైనా మోస్తా.. విూరే ఏ పని చెప్తే ఆ పని చేస్తా. రేపు సాయంత్రం వరకు ఎర్రవల్లి పరిశుభ్రంగా మారాలి. రేపు ఊరందరికీ నేనే భోజన ఏర్పాట్లు చేయిస్తా. ఎల్లుండి మొక్కలు నాటుదాం. వారం రోజుల తర్వాత ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి .. అందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. తాను నిజానికి తొలుత గంగదేవిపల్లికి ఎందుకు వెళ్లానంటే వాళ్లు పిలిపించుకునేట్లు చేశారన్నారు. మనం కూడా అలాగే చేయాలన్నారు. అభివృద్ది చెందిన  అంకాపూర్‌ గ్రామాన్ని విూరంతా చూసిరావాలి. అంకాపూర్‌లో రెండు బ్యాంక్‌ బ్రాంచుల్లో రూ. 22 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అభివృద్ధిలో అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఊరంతా శుభ్రంగా ఉంటే దోమలు రావు. రోగాలు రావు. హైదరాబాద్‌లోని ప్రగతి రిసార్ట్‌ కూడా చూసి రావాలి. ఆరు నెలల్లో ఎర్రవల్లిని బంగారువల్లిగా చేయాలి. వ్యవసాయం కూడా మారాలని, గ్రామానికంతటికి డ్రిప్‌ మంజూరు చేస్తానని హావిూ ఇచ్చారు. ఇంతకు ముందు కరెంట్‌ కోతలు అడ్డగోలుగా ఉండేది. ఇప్పుడా బాధలు లేవు. రెండేళ్లలో 24 గంటలు కరెంట్‌ ఇచ్చే బాధ్యత నాది. ఎర్రవల్లిలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు ఇచ్చి, 6 నెలల తర్వాత ఎర్రవల్లి ఆడబిడ్డ బిందె పట్టుకుని బయట కనపడొద్దు. ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలబడేట్టు నేను చేస్తా. ఎర్రవల్లికి రాబోయే నాలుగేళ్లలో రూ. 74 లక్షలు వస్తాయి. ఎర్రవల్లి గ్రామంలోని ప్రతీ రైతుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పిస్తానన్నారు. ఎర్రవల్లికి సాగునీరు, తాగునీరు, కరెంట్‌ తెచ్చే బాధ్యత నాదే. 132 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తాం. సర్వవర్గ కమిటీలో ప్రతి కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సర్వవర్గ కమిటీలో గ్రామాభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాలి. మనం కూడా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలి. ఎర్రవల్లి గెలిచి నిలవాలని సీఎం చెప్పారు. ఇక్కడే అధికారులు ఉంటారని, ఏదడిగినా చేస్తారని అన్నారు. అయితే సమిష్టిగా పనిచేసే బాధ్యతను మాత్రం విస్మమరించరాదన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన గ్రామాన్ని కలియతిరిగారు. గ్రామస్థులతో మాట్లాడారు. అధికారులు, స్థానిక నాయకులు వెంలవున్నారు.