గ్రామాలకు ఆర్థికసంఘం నిధులు
అభివృద్దికి దోహదపడతాయంటున్న సర్పంచ్‌లు
నిజామాబాద్,డిసెంబర్31(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్న భావిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి వేగవంతం చేసేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్రం ఎప్పటికప్పుడు గ్రాంట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర బ్జడెట్
నుంచి కూడా పంచాయతీలకు నేరుగా ప్రతి నెలా నిధులు విడుదల చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులను విడుదల చేసింది. విడుదలైన ఈ నిధులు ప్రస్తుతం ఆయా ట్రెజరీల్లో జమ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నిధులు పంచాయతీలకు ఆర్థికంగా చేయూత నివ్వనున్నాయి. జనాభా ప్రాతిపదికన విడుదలయ్యే ఈ నిధులతో గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యాచరణకు ఉపయోగపడనున్నాయి.