గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కెసిఆర్ లక్ష్యం
కరీంనగర్,జూన్25(జనం సాక్షి ): గ్రావిూణ అర్థిక సంస్థలు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. అందరి కోసం అభివృద్ది అనే నినాదంతో కెసిఆర్ ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. తాటి, ఈత వనం పెంచి,గౌడ కులస్తులను, నవీన క్షౌరశాలలో నాయిబ్రహ్మణులను, నగర ప్రాంతాలో లాండ్రిస్ ఇలా అన్ని వర్గాల వృత్తి నైపుణ్యం ఉన్న వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు మంచి పథకం అమలు చేసిందని, ఎలాంటి బ్యాంకు రుణం లేకుండా, లభ్దిదారులకు ఒక లక్ష 25 వేలకు ఒక యూనిట్‌గా 20 గొర్రెలను, ఒక పొట్టేలును అందిస్తుందని తెలిపారు. మాంసం ఎగుమతులను పెంచాలనేగొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిత్యం 600లారీల గొర్రెలు, మేకలను ప్రక్క రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. అందుకే ప్రభుత్వం గొల్ల, కురుమ లకు గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తుందన్నారు. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వలసలను అరికట్టేందుకే సబ్సిడీపై వృత్తిదారులకు రుణాలు మంజూరు చేస్తుందన్నారు. లబ్ధిదారులు గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



