చంద్రబాబూ.. రాజీనామా చెయ్..చాడ
హైదరాబాద్, జూన్ 11 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లో ఆయన విూడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉపయోగం లేదని ఆయనకు రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయమని చాడ పేర్కొన్నారు. అయితే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఎలా కొనసాగుతారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తలసాని ఇప్పటికీ తెలుగుదేశం శాసనసభ్యుడుగానే కొనసాగుతున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ మధుసూధనా చారి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.