*చరిత్ర లో చీకటికోణం… సెప్టెంబర్ 17*

*•1948 లో కేంద్ర బలగాలతో ఆపరేషన్ పోలో*
*•సెప్టెంబర్ 17 న విమోచనమా!? విలీనమా!? విద్రోహమా!?లేక సమైక్యమా!?*
బయ్యారం,సెప్టెంబర్16(జనంసాక్షి):
రెండు వందల ఏళ్ల అసఫ్‌జాహీల పాలనకు చరమగీతం పాడిన రోజది…నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్ నిరంకుశ పాలనకు అంతిమ తీర్పు పలికిన రోజది…రజాకార్ల రాక్షసకాండ అంతమైన రోజది…హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన రోజది…
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి హైదరాబాద్‌ సంస్థానం స్వయం ప్రతిపత్తి కలిగి వున్న రాజ్యం… నిజాం రాజుల పాలన కింద వున్న ఆ రాజ్యాన్ని అప్పటి భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపించి భారత భూభాగంలో విలీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ రాజ్యాన్ని కలుపుకోడానికి వంద గంటలు పట్టిందంటే మాములు విషయం కాదు…నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు ఇరవై రెండు వేల మంది సొంత సైన్యం వుండేది.. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన పఠాన్లు..రొమ్లాలతో కూడిన సైన్యమూ వుండేది…ఇది కాకుండా లక్ష మంది రజాకార్‌ మిలిటెంట్లు వుండేవాళ్లు…భారతసైన్యాన్ని సునాయాసంగా ఓడించవచ్చని అలీఖాన్ భావించారు.ప్రధాని లాయాక్‌ అలీ కూడా నిజాంకు భరోసా ఇచ్చారు.హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత యూనియన్‌లో కలిపేయమని చేసిన విన్నపాలను నిజాం పట్టించుకోకపోవడంతో అప్పటి ప్రధాని నెహ్రు 1948, సెప్టెంబర్‌ 12న కేంద్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌ రాజ్యంపై పోలీస్‌ చర్య చేపట్టాలని సమావేశం తీర్మానించింది.ఆ ప్రకారం మరుసటి రోజు నుంచి సైనిక చర్య మొదలైంది.అయిదు రోజుల్లో అంతమైంది.
సెప్టెంబర్‌ 13…..ఉదయం అయిదు గంటలకు అయిదు దారుల్లోంచి పోలీసు చర్య మొదలైంది.షోలాపూర్‌-సికింద్రాబాద్‌ మార్గంలో వున్న నాల్దర్గ్‌ కోటను టార్గెట్‌ చేసింది భారత సైన్యం… లెఫ్టినెంట్‌ కల్నల్‌ రామ్‌సింగ్ సారథ్యంలోని మరో సైనికబృందం… హైదరాబాద్‌కు 66 కిలో మీటర్ల దూరంలో మరో సైనిక బృందం…విజయవాడవైపు మరో సైనిక బృందం..గుంతకల్‌ వైపు మరోటి….ఇలా హైదరాబాద్‌ను అన్నివైపులా చుట్టుముట్టాయి భారత సైనిక దళాలు…
సెప్టెంబర్‌ 14….సైనిక చర్యకు హెడ్‌ అయిన మేజర్‌ జనరల్‌ చౌదరి హైదరాబాద్‌ రాజ్యానికి తూర్పున వున్న రాజసుర్‌కు సైన్యాన్ని చేర్చాలనుకున్నాడు.. అయితే ప్రయాణం అంత సులభతరం కాకపోవడంతో వాయుసేన సహకారం తీసుకున్నాడు… ట్యాంకులు కూడా వచ్చాయి… ఇదే సమయంలో మేజర్‌ జనరల్‌ డిఎస్‌ బ్రార్‌ సైన్యం ఔరంగాబాద్‌ దిశగా చొచ్చుకు వచ్చింది… నిజాం సైన్యం వారితో పోరాడి ఓడిపోయింది. ఔరంగాబాద్‌ భారత్‌ ఆధీనమైంది..
సెప్టెంబర్‌ 15…భారత సైన్యం లాతూర్‌వైపు సాగింది…మరోవైపు సూర్యపేట మీద వైమానిక దళం దాడులు చేసింది… పరిస్థితిని గమనించిన నిజాం సైన్యం భారత సైన్యాన్ని అడ్డుకోవడం కోసం మూసీ నదిపై వున్న వంతెనను పాక్షికంగా ధ్వంసం చేసింది. ఇంకోవైపు జహీరాబాద్‌..బీదర్‌ల వైపు నుంచి భారత సైన్యం దాడి కొనసాగించింది.
సెప్టెంబర్‌ 16 ….రామ్‌సింగ్‌ నేతృత్వంలోని భారత సైన్యం జహీరాబాద్‌లో అడుగు పెట్టాయి.. షోలాపూర్‌-హైదరాబాద్ రహదారిని ఆక్రమించుకుంది…నెమ్మదిగా హైదరాబాద్‌ దిశగా సాగడం మొదలు పెట్టింది…
సెప్టెంబర్‌ 17….తెల్లవారక ముందే భారతసైన్యం బీదర్‌కు చేరింది… మరోవైపు బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో బాంబులు పడుతున్నాయని స్టేషన్‌ మాస్టర్‌ ప్రధాని లాయక్‌ అలీకి ఫోన్‌లో చెప్పాడు…మరికాసేపటికే నైజాం ఆర్మీ కమాండర్‌ ఇద్రీస్‌ కూడా తన అశక్తతను వ్యక్తం చేశాడు… ఎనిమిది గంటలకు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను లాయక్‌ అలీ కలిశాడు…భారతసైన్యం రాజధానిలోకి వస్తే రక్తపాతం జరుగుతుందని… అమాయకప్రజలు అనవసరంగా మరణిస్తారనే వాస్తవాన్ని మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తెలుసుకున్నారు…ఆ వెంటనే లాయక్‌ మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు..మంత్రి మండలి రాజీనామా చేసింది… ఈ మధ్య కాలంలో ఉస్మాన్‌ అలీఖాన్ భారత ప్రభుత్వ ప్రతినిధి కె ఎం మున్షీతో సంప్రదింపులు మొదలు పెట్టారు….మిశ్రమ పరిపానలపై ప్రతిపాదనలను ముందుంచారు…ఓ పక్క సంప్రదింపులు జరుగుతుంటే…మరోపక్క రేడియోలో ప్రధాని లాయక్‌ అలీ..కాశీం రజ్వీలు ప్రజలను సంయమనంతో వుండాలని సందేశమిచ్చారు.. నిజాం కూడా సైన్యాన్ని వెనక్కి పిలుస్తూ ఆదేశాలిచ్చారు…మున్షీ కూడా రేడియోలో మాట్లాడారు..తర్వాత బొల్లారం రెసిడెన్సీకి వచ్చిన మేజర్‌ జనరల్‌ చౌదరి నిజాం మిశ్రమ పాలన ప్రతిపాదనలను తోసిపుచ్చారు… మిలటరీ పాలనను ప్రకటించారు…మున్షీతో కుదిరిన ఒప్పందానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా వుండటంతో నిజాం రాజు దిగ్బ్రాంతి  చెందాడు… అప్పటికే అంతా అయిపోయింది… అధికారం చేతులు మారింది…నిజాం అశక్తుడయ్యారు…
1948…సెప్టెంబర్‌ 17…దక్కన్‌ రేడియోలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రసంగం… తెలంగాణ ప్రజలు ఆసక్తితో వింటున్న అపురూప క్షణమది…సంతోషంతో నా ప్రజలకు తెలియచేస్తున్నాను… నా ప్రభుత్వం రాజీనామా చేసింది…ప్రభుత్వ బాధ్యతలను చేపట్టవలసిందిగా గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారికి విజ్ఞప్తి చేస్తున్నాను….ఇదీ ప్రసంగ సారాంశం…హైదరాబాద్‌ రాష్ట్రం భారతంలో భాగమైంది…యువరాజు అజంజాహి అసఫ్‌జాహి జెండాను దించేసి…త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు…నిజాం పాలన అంతమవ్వడానికి భారత సైన్యమే కారణం కాదు… నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో యోధులు ప్రాణాలకు తెగించి పోరాటం సాగించారు..తెలంగాణ విమోచనం కోసం వీరోచిత తెలంగాణ కోసం విమోచనోద్యమ గీతాలను రచించిన కవులు ..ఆడిపాడిన కళాకారులు కూడా తమ వంతు కృషి చేశారు.. మఖ్దూం మొయినుద్దీన్‌, దాశరథి…కాళోజి.. హీరాలాల్‌మోరియాలు గీతాలతో జనాలను ఉత్తేజపరిచారు… ఓ చేత్తో గన్ను…మరో చేత్తో పెన్ను పట్టుకుని పాటలల్లి… చైతన్యం తెచ్చిన వారూ ఉన్నారు.. యాదగిరి…తిరునగరి రామంజనేయులు… సుద్దాల హనుమంతు.. అలువాల మాచయ్య., ఆవుల పిచ్చయ్య, ఇలా ఎందరో కవులు తమ పాటలతో ప్రజా పోరాటలకు ఊపునిచ్చారు.
భారత్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ కలిసింది సరే.. విలీనమా? విమోచనమా? అన్న విషయంలో ఎందుకింత గందరగోళం అంటే ఎవరి దృష్టికోణం నుంచి వారు ఈ ఎపిసోడ్‌ను చూడటమే కారణం.
ఇక విలీనం అన్న మాటకి వస్తే దీనికి సంబంధించి కొంత గందరగోళమే ఉంది. మొదట్లో భారత ప్రభుత్వమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించలేదు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 13 నెలల వరకూ కూడా హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో అంతర్భాగంగా లేదు. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్‌ పోలో పేరుతో పోలీసు చర్యకి దిగి ఈ ప్రాంతాన్ని భారత్‌ యూనియన్‌లో చేర్చారు. పేరుకిది పోలీసు చర్య
కానీ, యుద్ధానికి దిగింది మాత్రం భారత సైన్యం. ఆ దాడితో 225 సంవత్సరాల ఆసఫ్‌జాహీల పాలన అంతమైంది. అయితే ఈ చర్యను నిరసిస్తూ అప్పటి నిజాం నవాబు ఉస్మాన్‌అలీ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుకూడా చేశారు. ఎన్నడూ ఢిల్లీ పాలనలో లేని తమ సంస్థానంపై భారత్‌ సైనిక జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్దమని ఆయన వాదించారు. దీనిపై భారత ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ- “హైదరాబాద్‌ సంస్థాన ప్రజల హక్కులు అణచివేస్తుంటే జోక్యం అనివార్యమైందని, తాము చేసింది పోలీసు చర్యే కానీ, సైనిక చర్య కాదని” సమర్థించుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పోలీస్‌యాక్షన్‌కి అయిన ఖర్చు 200 కోట్ల రూపాయలు. ఈ ఖర్చుని ఏ శాఖ పద్దుకింద చూపించాలన్న విషయంలో అప్పట్లో పార్లమెంటులో చర్చ జరిగింది. పేరుకిది పోలీస్‌ యాక్షనే అయినా- దాడిలో పాల్గొన్నది సైనికులు కనుక ఈ ఖర్చును తమ పద్దులో చూపడానికి హోంమంత్రిత్వశాఖ ఒప్పుకోలేదు. ఈ తలనొప్పంతా ఎందుకని రక్షణశాఖ కూడా ఆ ఖర్చుని మీదేసుకోడానికి అంగీకరించలేదు. చివరికి ఈ ఖర్చుని వైద్య ఆరోగ్యశాఖ పద్దులో చూపారు. ఇప్పటికీ అధికారిక పత్రాల్లో ఇదే నమోదైవుంది. హైదరాబాద్‌ సంస్థాన విలీనంలో ఇన్ని లొసుగులు, వివాదాలు వున్నందువల్లే కేంద్రస్థాయిలో స్పష్టమైన విధాన ప్రకటన కనిపించదు. అంతేకాదు- భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు, హైదరాబాద్‌ సంస్థానంలో నమోదైన కేసులను భారతయూనియన్‌కి సంబంధించిన కేసులుగా పరిగణించడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించ లేదు. 1962లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్‌లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నది. 1972లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ, 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ పోలో పేరిట సాగిన సైనికచర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్కడా విమోచన, విముక్తి అన్న పదాలను వాడలేదు. అందుకే ఇంత గందరగోళం.. ఏది ఏమైనా
స్వతంత్రంగా వున్న హైదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. ఇది విలీనం అనో… విమోచనం అనో ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానించినా- ప్రస్తుతానికి భారత రాజ్యంగబద్ద పాలనకిందే వుంది. ఇదొక్కటే పరమ వాస్తవం.కానీ ప్రస్తుతం రాజకీయ కోణంలో ఒక్కొక్కరు ఒక్కోలా వర్ణిస్తూ, వారి వారి స్వార్ధ రాజకీయ లాభాలకు ఆపేక్షించడం బాధాకరం.