చరిత్ర సృష్టించబోతున్న ప్రగతినివేదన సభ: డాక్టర్‌ సంజయ్‌

జగిత్యాల,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సెప్టెంబర్‌2న కొంగరకలాన్‌లో నిర్వహిస్తున్న ప్రగతినివేదన బహిరంగ సభ దేశచరిత్రలోనే అతిపెద్ద సభగా నిలిచిపోతుందని టీఆర్‌ఎస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. దేశం మొత్తం ఇప్పుడు 25లక్షల మందితో టీఆర్‌ఎస్‌ నిర్వహించబోతున్న సభవైపే ఆసక్తిగా చూస్తున్నదన్నారు. ఈసారి టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌ పట్ల అభిమానం/-తో ఉన్నారని సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటేందుకే సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. సభ విజయవంతానికి గ్రామాల్లో క్షేత్ర స్థాయి నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇందులో భాగస్వాములు కావాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముభారక్‌, సీఎం రిలీఫ్‌ఫండ్‌ మాత్రమే కాకుండా ఇటీవల దేశం యావత్తు విస్తుపొందే రీతిలో అమలు చేసి అందరి ప్రశంసలు పొందిన రైతుబంధు లబ్దిదారులు పెద్ద ఎత్తున సభకు తరలి రాబోతున్నారన్నారు. అభివృద్ధి గురించి ప్రతిపక్షనాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రగతి నివేదన సభకు జనం పోటెత్తనున్నారనీ, ప్రతిపక్షాలు నివ్వెరపోయే రోజు వస్తున్నదన్నారు.