భూ పోరాటానికి నాందిగా నిలిచిన చాకలి ఐలమ్మ

నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నాటి భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అంతటి వీర వనిత విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

బాంచన్ దొరా కాల్మొక్కుతా అనే స్థితిలో ఉన్న పీడితులతో బందూకులు పట్టించి దొరలను గడగడలాడించిన ఘనత ఐలమ్మదని పేర్కొన్నారు. దొరల దాష్టీకాలపై సివంగిలా గర్జించిన ఐలమ్మ నడుముకు కొంగుచుడితే, దొరతనం తోక ముడిచిందన్నారు.

దొర ఇంట్లో వెట్టి చాకిరి చేసే నాటి సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ ఐలమ్మ 40 ఎకరాల భూమిని కౌలు తీసుకుని పంట పండించిందన్నారు.

దీనిని జీర్ణించుకోలేకపోయిన దొరలు ఐలమ్మ పంటను బలవంతంగా కోసుకుని తేవాలంటూ వంద మంది అనుచరులను పంపిస్తే.. ఐలమ్మ తన నలుగురు కొడుకులతో కలిసి వంద మందిని తరిమి తరిమి తన వీరత్వాన్ని చాటిందని మంత్రి కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టులు భూ పోరాటానికి నాంది పలికారన్నారు.