చిన్నారి కోసం సహాయక చర్యలు ముమ్మరం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలోని ఓ పొలంలో బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిన్నారి సుమారు 40 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన సహాయ సిబ్బంది ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రొకెయిన్ల సాయంతో బోరుబావికి సమాంతరంగా భారీ గొయ్యి తవ్వుతున్నారు. ఆక్సిజన్‌ పైపుల సాయంతో చిన్నారికి ప్రాణవాయువు అందిస్తున్నారు. చిన్నారి బోరుబావిలో పడి 18 గంటలకు పైగా కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

సహాయచర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నూతన పద్ధతుల్లో చిన్నారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోబోటిక్‌ చేతిని లోనికి పంపి చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి బోరుబావిలో పడిందన్న వార్త తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలు అక్కడికి చేరుకుంటున్నారు.