చెట్లు నరకితే కఠిన చర్యలు

హరితహారం మొక్కల రక్షణకు ఏర్పాట్లు
నిజామాబాద్‌,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): మొక్కల పెంపకంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అక్రమంగా చెట్లను నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరైనా అనుమతి లేకుండా చెట్లను నరికినా, దొంగకర్ర ఎగుమతి చేసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. మానవాళికి ప్రాణవాయువును అందించే చెట్ల సంరక్షణ పౌరుల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యవసాయ బావుల తవ్వకం, బోర్లు వేయడం ఆరు నెలల వరకు నిషేధం ఉందనీ ఎవరు వేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదో విడుత హరితహారం విజయవంతం చేయడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండల
నుంచి కాపాడటానికి సన్నాహాలు చేస్తున్నారు. మొక్కలు ఎండల నుంచి తట్టుకునేలా షెడ్‌నెట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది హరితహారంలో మొక్కలను నాటి టార్గెట్‌ పూర్తిచేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఒకరు అన్నారు. ఎండల నుంచి మొక్కలకు రక్షణ ఉండేందుకు గ్రీన్‌షెడ్‌నెట్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొక్కల పెంపకంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వీటి పెంపకంలో క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా అలర్ట్‌ చేశాం.గ్రామప్రాంతాల్లో మొక్కలు నాటడానికి అనువుగా అన్నీ సిద్ధం చేశామని అన్నారు. ఐదో విడుత హరితహారంలో భాగంగా పంపిణీ చేయడానికి మొక్కలను వననర్సరీల్లో సిద్దం చేసామన్నారు. ఆయా నర్సరీల్లో గ్రామాల్లో అందజేయడానికి మొక్కలు సిద్దంగా ఉన్నాయి. వివిధ రకాల నీడనిచ్చే, పండ్ల, పువ్వుల మొక్కలను సైతం పెంచుతున్నారు. ప్రధానంగా టేకు, వేప, కానుగ, ఖర్జూర, ఈత, నెమలినార, చింత, దానిమ్మ, జామ, గుల్మోర్గ, మర్రి, రావి తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వేసవిని తట్టుకునే మొక్కలు కూడా ఉన్నాయి. కాగా ఎండల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి షెడ్‌నెట్‌లను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు కూడా నర్సరీలను సందర్శించి మొక్కల వివరాలను సేకరించారు. ఈసారి అత్యధికంగా పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.