చెప్పుకో ‘లేఖ’
హైదరాబాద్/సుల్తానాబాద్, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరి ఏమిటో లేఖ రూపంలో వివరిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం సొత్కపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అఖిలపక్ష
సమావేశానికి టీడీపీ తరఫున సీమాంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ప్రాంతం నుంచి కడియం శ్రీహరి హాజరవుతారని అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండు రోజులు వేర్వేరుగా ఇరు ప్రాంతాల నేతలతో భేటీ అయిన చంద్రబాబు అందరితో కలిపి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ వైఖరిని తెలిపే లేఖతో ప్రతినిధులు వెళ్తారని, సమావేశం అనంతరం లేఖను మీడియాకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. బయటికి ఇంత సాధారణంగా టీడీపీ నేతలు ప్రకటన చేసి ఇందుకోసం భారీగానే కసరత్తు జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పొలిట్‌బ్యూరో సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ ఉద్యమ తీవ్రత, ప్రజల్లో ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చి తీరాల్సిందేనని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌పై చంద్రబాబు సహా సీమాంధ్ర పార్టీ నేతలంతా మౌనం దాల్చారు. తెలంగాణ నేతలు స్థానికంగా నెలకొన్న పరిస్థితులు వివరిస్తుండగా, సీమాంధ్ర ప్రాంత నేతలు మాత్రం అఖిలపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోబోతోంది, అది తీసుకునే నిర్ణయం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే తరహాలో చర్చలు జరిపారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడ్డామని ప్రకటిస్తే ఆ పార్టీకి సీమాంధ్రలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంటుందని, కానీ తెలంగాణలో బోణీ కూడా కొట్టబోదని ఊహల్లో మునిగి తేలారు. దాదాపు మూడున్నర గంటల పాటు తమ నిర్ణయం వల్ల పెరిగే, తగ్గే సీట్లను బేరీజు వేసుకుంటూ కాలం గడిపారు. తెలంగాణపై 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖనే నేటి అఖిలపక్ష సమావేశంలో మళ్లీ ఇవ్వాలని చివరకు నిర్ణయించారు. పాత లేఖనే చూపి తెలంగాణ ప్రజల ఓట్లు పొందాలని కుయుక్తి పన్నారు. చివరి వరకు ఓట్లు, సీట్ల రాజకీయం మినహా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదు. అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై అధికార కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి తెలపాలని పాత పాటే పాడారు. భోజనం తర్వాత పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఇకపై మాట్లాడబోనని అన్నారు. 2008లోనే తమ పార్టీ తెలంగాణపై ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందని చెప్పారు. 2009 డిసెంబర్ 10న తెలంగాణపై తాను అడ్డంగా మాట్లాడిన విషయాన్ని తొక్కి పెడుతున్నానని మాత్రం బాబు ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలు అమాయకులు ఏమి చెప్పినా వింటారనే భావనే ఆయన మాటల్లో వ్యక్తమైంది. తెలంగాణపై అంత స్పష్టమైన వైఖరి ఉంటే బహిరంగంగానే ప్రకటించవచ్చు, అలా కాకుండా సీల్డ్ కవర్‌లో లేఖ ఇవ్వడమేమిటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు మాని తెలంగాణపై బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.