తెలంగాణ గుండె గొంతుక

 

‘జనంసాక్షి’ ఉద్యమ వెబ్‌సైట్‌ను
ప్రారంభించిన కోదండరామ్‌
కరీంనగర్‌ : కరీంనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న తెలంగాణ దినపత్రిక ‘జనంసాక్షి’ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయనకు పత్రిక ఎడిటర్‌ ఎంఎం.రహమాన్‌, సంపాదకవర్గం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో తెలంగాణవాదాన్ని జనంసాక్షి దినపత్రిక బలంగా వినిపిస్తున్నదని కొనియాడారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన వార్తా స్రవంతిని తెలుపుడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో జనంసాక్షి పత్రిక కీలక పాత్ర వహిస్తున్నదని, పరకాలలో తెలంగాణవాదాన్ని గెలిపించేందుకు జనంసాక్షి చేసిన కృషి మరువలేనిదని కోదండరాం పేర్కొన్నారు. యువ జర్నలిస్టులతో విజయవంతంగా పత్రికను నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. నేటి కాలంలో ఎల్లో మీడియా రాజ్యమేలుతున్నదని, ఇలాంటి సమయంలో ప్రజలకు తెలంగాణ ఉద్యమ వాస్తవాలు తెలుపుతున్న పత్రికల్లో జనంసాక్షి పాత్ర మరువలేనిదన్నారు. వెబ్‌సైట్‌ ప్రారంభించిన అనంతరం కోదండరాం పత్రిక ప్రతులను పరిశీలించి, కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. జనంసాక్షి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు శుభాకాంక్షలు తెలిపారు. మరో ముఖ్య అతిథి డాక్టర్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ జనంసాక్షి యాజమాన్యం, సంపాదకవర్గం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్‌ అధ్యక్షుడు వెంకట మల్లయ్య, జిల్లా కోఆర్డినేటర్‌ .జక్కోజి వెంకటేశ్వర్లు, నగర ప్రధాన కార్యదర్శి కోటేశ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి షుకురుద్దీన్‌, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు రజాఖ్‌, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి బుర్ర తిరుపతి గౌడ్‌, డీటీఎఫ్‌ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.