జనం ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం
తొమ్మిది నెలల పాలనపై సమీక్ష
కరెంటు కష్టాలను అధిగమిస్తాం
బయ్యారంపై సర్వేకు నిర్ణయం
జనం మనోభావాలకు తగ్గట్టుగా పాలిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): శతాబ్ద కాలంగా అనేక రకాల గోస పడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరు పాళ్లు రావాలంటే, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టి ముందకు తీసుకుని వెల్లాల్సి ఉందన్నారు. 9 నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టాల్సిన పనులపై ఆయన సవిూక్షించారు. నీతి ఆయోగ్‌తో సహా కేంద్రం నుంచి రావాల్సిన ఇధులపైనా సవిూక్షించారు. క్యాంపు కార్యాయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, డిజిపి, జిహెచ్‌ఎంసి కవిూషనర్,సిటి పోలీస్ కవిూషనర్, జెన్‌కో చైర్మన్, టిఎస్‌ఐఐసి ఎండి, ఇడి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వంద సంవత్సరాలుగా పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న ఇబ్బందులను, మారుతూ వస్తున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. నిజాం పాలన మంచి చెడులు, రజాకర్ల ఆవిర్భావం-ప్రభావం, సైనికపాలన, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు,1969 ఉద్యమం, ఇడ్లి సాంబారు గో బ్యాక్ ఉద్యమం, గైర్ మల్కి గోబ్యాక్ ఉద్యమం, 2001 నుంచి రాజకీయ పోరాటం, మధ్యలో వచ్చిన వివిధ రకాల ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిని బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రారంభంలో పడుతున్న కష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి భావోద్వేగంగా, సోదాహరణలతో అధికారులకు విడమర్చి చెప్పారు. ఈ నేపధ్యం ఉన్న తెలంగాణ రాష్టాన్న్రి మంచి పద్దతిలో ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులుగా తమకు, అధికార యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న అధికారులకు ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాలనలో మూడు భాగాలు ఉన్నాయన్నారు. ఒకటి…. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రెండు… కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు…. అధికారులు వీరంతా కలిస్తేనే, సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పాలనను కూడా మూడు విభాగాలుగా మార్చుకుని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ఒకటి… పేదలు-సంక్షేమం,రెండు..వ్యవసాయం, మూడు పరిశ్రమలు – పెట్టుబడులు-మౌలిక వసతులు. ఈ మూడు విభాగాల్లో సమతుల అభివృద్ది కోసం విధానాల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్దంచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న అవగాహన, పరిమిత వనురుల, పరిమిత అవకాశాల, మేరకు మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. మొదటి బడ్జెట్ లో ప్రభుత్వ అంచనాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిఫలించాయన్నారు. ఈఏడాది ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ సమగ్రంగా రూపోందాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాల ఆధారంగా, నిజాల భూమికపై పనిచేయాలని, మంచి చెడులను ప్రజలకు విడమర్చి చెప్పాలని, ఎలాంటి దాపరికం అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దేశాన్ని నూతన పంధాలో నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని వెల్లడించారు. కొద్ది కాలం క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే ప్రధానిగా ఉండడం రాష్టాల్రకు సానుకూల అంశమని ముఖ్యమంత్రి విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వ పధకాలను బాగా కుదిస్తున్నారని, రాష్టాల్రకు కేంద్రం ఇచ్చే నిధులను విధానంలో కూడా సమూల మార్పులు రానున్నాయని, అనేక కొత్త ఆలోచనలు కేంద్రం చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా పధకాలు, కార్యక్రమాలకు తుది రూపం ఇచ్చే పనిలో అక్కడి యంత్రాంగం ఉందన్నారు. కేంద్రం నుండి వివిధ పధకాలకు సంబందించి వచ్చే విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు రూపోందించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్టాన్రికి అనేక అనఉకూలతలు ఉన్నాయని, ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు పెట్టుబడులకు ఎంతో ఆకర్శణీయంగా ఉన్నాయన్నారు. అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు లేకపోవడం, నీళ్లు కూడా అందుబాటులో ఉండడం, చాలినంత భూమి కలిగి ఉండడం లాంటి అనుకూలతలు తెలంగాణ రాష్టాన్రికి ఉన్నాయన్నారు.
పారిశ్రామిక హబ్‌గా హైదరాబాద్
భారత స్వాతంత్య్రానికి ముందే హైదరాబాద్‌లో 165 పరిశ్రమలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఐటి దిగ్గజాలైన ఐబిఎం, గూగుల్, మైక్రో సాప్ట్ లాంటి కంపెనీలు తమ మేయిన్ సర్వర్స్‌ను హైదరాబాద్‌లో పెట్టుకుంటున్నాయన్నారు. హైదరాబాద్‌కు, తెలంగాణకు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికి ప్రస్తుతం కరెంట్ విషయంలో మాత్రమే కొంత ఇబ్బంద ఉందన్నారు. దానిని అధిగమించేందుకు కూడా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని చెప్పారు. 2018 చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో 23 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈఏడాది చివరికే 6679 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో కరెంట్ కష్టాలు చాలా వరకు తీరుతాయన్నారు. పరిశ్రమలకు చాలినంత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప పారిశ్రామిక విధానం తెలంగాణలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. సింగిల్ విండో విధానం, పెట్టుబడి దారులకు అనుమతులు పొందే హక్కు, టిఎస్ ఐ పాస్ చట్టం, 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానం, పారిశ్రామిక అనుమతుల కోసం సిఎంఓలో ప్రత్యేక విభాగం తదితర అంశాలన్నీ తెలంగాణకు ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు రావడానికి కారణమవుతాయన్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో జవహర్‌లాల్ నెహ్రు నాయకత్వంలో సౌమ్యవాద వైఖరితో పాలన సాగిందన్నారు. ప్రణాళిక సంఘాల ఏర్పాటు కూడా దానికి అనుగుణంగా జరిగిందని చెప్పారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు వచ్చాయని, మార్కట్ ఎకనావిూ వైపు పోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరుడు గట్టిన కమ్యూనిస్టుల దేశమైన చైనాలో కూడా సడలింపులు అనివార్యమయ్యాయని చెప్పారు. ప్రైవేటు రంగాన్ని విస్మరించే పరిస్థతి లేదన్నారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు జరుగుతాయని, అందులో భాగంగానే మోడి ప్రభుత్వం నీతి అయోగ్ ప్రవేశపెట్టిందన్నారు. మారిన పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని, అది గొప్ప అదృష్టమని ముఖ్యమంత్రి కితాబునిచ్చారు. సమయ పరిమితులు పెట్టకోకుండా అధికారులు రాత్రి పొద్దు పోయే వరకు కూడా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని అభినందించారు. అధికారులు ఒక శాఖకు బాధ్యులుగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారధులుగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకుని, తమ అనుభవాలను పంచుకోని, తరచూ చర్చలు జరుపుకుని మంచి విధానాలను రూపోందించాలని చెప్పారు. తనకు, మంత్రులకు కూడా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన కార్యక్రమాలన్నింటి పైనా అందరు అధికారుల వద్ద సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. అధికారులే తెలంగాణ రాష్టాన్న్రి ప్రమోట్ చేయాలని సూచించారు.
మరోవైపు ఖమ్మం జిల్లా బయ్యారంలో ఇనుపఖనిజం అన్వేషణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అన్వేషించాలని నిర్ణయించింది. అందుకుగాను భూగర్భ గనుల శాఖ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా సర్వే చేపట్టనున్నాయి. సర్వే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి తో బయ్యారం ఉక్కుకర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో ఇప్పుడు సర్వేకు నిర్ణయించారు.