జమ్మికుంటలో తీవ్రమైన మంచినీటి సమస్య
ఖాళీబిందెలతో మాజీ ఎంపి పొన్నం ర్యాలీ
మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు
నీటి సమస్య లేదంటున్న పాలకులు ఇక్కడికి రావాలని సవాల్
జమ్మికుంట,మే3(జనం సాక్షి): తాగునీటి ఎద్దడి లేదంటున్న పాలకులు జమ్మికుంటకు వస్తే సమస్య ఏంటో చూపిస్తానని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. ఎక్కడా తాగునీటి సమస్య లేదని, ఖాళీకుండల ప్రదర్శన, బిందెల ప్రదర్శన లేకుండా చేశామంటున్న కెటిఆర్ జమ్మికుంట పట్టణంలో త్రాగునీటి సమస్యను ఎందుకు పరిస్కరించలేదన్నారు. ఇక్కడ తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఖాళీ బిందెలతో ర్యాలీ చేపట్టారు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో, కుండలతో పొన్నం, కాంగ్రెస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడి సమస్యలపై తక్షణం స్పందించాలన్నారు. ఇదిలావుంటే కరీంనగర్‌లో కూడా సమస్యపై కాంగ్రెస్ నేతుల గతకొంకాలంగా ఆందోళన చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ దశలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలోని బృందం నాగపూర్‌కు శుక్రవారం బయలుదేరనుంది. అక్కడ నిరంతర తాగునీటి విధానం అధ్యయనం చేయనుంది. ఇదిలావుంటే జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. గంగాధర, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, కరీంనగర్, జమ్మికుంట మండలాల పరిధిలో తాగునీటి సమస్య నెలకొంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అ/-దదె బావుల ద్వారా తాగునీరు అందిస్తున్నా.. సమస్య పరిష్కారం కావడంలేదు. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటడంతో తీవ్రత పెరుగుతోంది. తాగునీటి ఎద్దడి విషయమై ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. భగీరథ ట్రయల్‌రన్‌లు పూర్తి కాగానే సమస్య లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నా.. రామడుగు, కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల్లో పైపుల లీకేజీతో కథ మొదటి వస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు అడుగంటింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని జలాశయాల నుంచి రక్షిత నీటి పథకాల రిజర్వాయర్ల వరకు పంపించాలన్న ప్రయత్నాలు ఇంకా నెరవేరలేదు. పైపులైన్ల లీకేజీతోనే సతమతమవుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. ఏటా వేసవి ముందు తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వ అనుమతితో చర్యలు చేపడుతారు. ఈ సారి ప్రణాళికలు పంపినా నిధుల మంజూరుకు ఆమోదం లభించలేదు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని పాలనాధికారులు ఆదేశించినా కొన్ని గ్రామాల్లో సర్పంచులు సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో నీటితో పాటు నిధుల సమస్య ఏర్పడింది. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. తాగునీటి ఎద్దడి తీర్చేందుకు గ్రావిూణ నీటి సరఫరా విభాగం ద్వారా జిల్లాలోని గంగాధర, మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లోని 3 గ్రామాల్లో
ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. మే నెలలో ఎద్దడి దృష్టిలో పెట్టుకొని ఈ మండలాలతో పాటు రామడుగు మండలం కలుపుకొని మరో ఆరు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని గంగాధర, మానకొండూరు, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, చొప్పదండి, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక మండలాల్లోని 32 గ్రామాల పరిధిలో 48 బావులను అద్దెకు తీసుకొని నీరందిస్తున్నారు. మే నెలలో ఇల్లంతకుంట, హుజురాబాద్, జమ్మికుంట, కరీంనగర్, సైదాపూర్ మండలాలను కలుపుకొని పాత మండలాల్లోని 83 గ్రామాల్లో 184 అద్దె బావుల ద్వారా నీరందించాలని నిర్ణయించి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపారు. మే నెలకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది. ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి ప్రత్యేక నిధులు కేటాయించలేదు.