జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం..
టీయూడబ్ల్యూజేహెచ్ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా
రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి)
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటామని టీయూడబ్ల్యూజేహచ్ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా అన్నారు. శనివారం జిల్లాలో యూనియన్ సభ్యులకు సభ్యత్వ గుర్తింపు కార్డులను ఎస్పీ రాహుల్‌హెగ్డే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లాయక్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఇప్పటిదాకా జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమించిన ఘనత టీయూడబ్ల్యూజే 143కే దక్కిందని తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మందికి ఇవ్వడం జరిగిందని ఈ విషయంలో కొన్ని యూనియన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు సరికావని అన్నారు. చిన్న పత్రికల విషయంలో కొన్ని సమస్యలు వచ్చిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులకు ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు బిజిగిరి శ్రీనివాస్, ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ రవి, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, సిరిసిల్ల వేములవాడకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.