జాతీయ పెన్షన్ పథకం(కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం) రద్దు చేయాలి
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి.
USPC డిమాండ్
దండేపల్లి. జనంసాక్షి.01 సెప్టెంబర్.ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపుమేరకు గురువారం. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజన సమయంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా యుఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవేణు మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ బడా వ్యాపారస్తులకు పెట్టుబడిని సమకూర్చే దురుద్దేశంతో ప్రపంచ బ్యాంకు రూపొందించిన భారతదేశంలో పెన్షన్ సంస్కరణలు అనే డాక్యుమెంటు ఆధారంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నియమించిన బికె భట్టాచార్య కమిటీ సిఫారసుల మేరకు ఓల్డ్ ఏజ్ సోషల్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ (OASIS) పేరుతో 2003 డిసెంబర్ 22 న కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 1.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) అమలు చేస్తున్నదన్నారు . ఆ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1.09.2004 నుండి సిపిఎస్ ను అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,61,141 మంది ఉద్యోగులు సిపిఎస్ చందాదారులు గా ఉన్నారు.
యుపిఎ – II హయాంలో 2013 సెప్టెంబర్ 4న ఎట్టకేలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి లు కూడ పిఎఫ్ఆర్డిఎ బిల్లును పార్లమెంటులో ఆమోదించటంతో చట్టంగా మారిందన్నారు.
పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి ఒక్కరూపాయి కూడా పెన్షన్ ఫండ్ కు చందా కట్టకుండానే రిటైరైన లేదా చనిపోయిన సందర్భంలో చివరినెల వేతనంలో సగం మరియు దానిపై కరువు సహాయం(డిఆర్) పెన్షన్ గా చెల్లించబడేది. కానీ నూతన పెన్షన్ పథకం ప్రకారం 1.01.2004 తర్వాత నియామకం అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం+ డిఎ పై 10% మినహాయించి పెన్షన్ ఫండ్ కు జమచేస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పేర పెన్షన్ ఫండ్ లో జమచేస్తుంది. ఈ మొత్తాన్ని వివిధ ఫండ్ మేనేజర్ల ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెడతారు. ఉద్యోగి రిటైర్మెంట్ లేదా మరణించిన సందర్భంలో ఆనాటికి ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్న మొత్తంలో 60% ఉద్యోగికి.కుటుంబానికి అందజేసి మిగిలిన 40% యాన్యుటీలు కొనుగోలు చేసి వాటిపై వచ్చే డివిడెండ్ ను నెల నెలా పెన్షన్ గా చెల్లిస్తామంటున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా, సొమ్ము పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకోదు. కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని అన్నారు .
ఉద్యోగుల నిరంతర పోరాటాల ఫలితంగా డెత్ గ్రాట్యుటీ, ఫామిలీ పెన్షన్, ప్రభుత్వ వాటాను 10 నుండి 14 శాతానికి పెంచుకోగలిగామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత పెన్షన్ విధానాన్ని అమలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం సిపిఎస్ అమలుకే మొగ్గు చూపి ఏకపక్షంగా పిఎఫ్ఆర్డిఎ తో ఒప్పందం చేసుకున్నదన్నారు.రాష్ట్రంలో ఉద్యోగి మరణిస్తే డెత్ గ్రాట్యుటీ ఇస్తున్నప్పటికీ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలంటే మాత్రం అప్పటివరకు ఉద్యోగి నుండి మినహాయించిన సిపిఎస్ చందా మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేయాలని షరతు విధించింది. ఇది దుర్మార్గం. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత కాదు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తప్పించుకుంటున్నదని అన్నారు.పిఎఫ్ఆర్డిఎ చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు మాత్రమే తన బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ ఉద్యోగులను మోసం చేస్తున్నదన్నారు .
పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును విస్మరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతర పెన్షన్ చెల్లింపు బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగి షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేయటం అత్యంత గర్హనీయం అని అన్నారు.
ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను USPC డిమాండ్ చేస్తున్నదని అన్నారు . అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొట్టె చంద్రమౌళి, మండల అధ్యక్షులు రత్నం తులసిపతి, ప్రధాన కార్యదర్శి ఇండ్ల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సతీష్, గోపగాని రవీందర్,s. ప్రసాద్ రావు,వినోద్ కుమార్ పాల్గొన్నారు.