జియోట్యాగింగ్‌తో అక్రమాలకు చెక్
ఇసుక రవాణాకు పక్కా ప్రణాళిక
సత్ఫలితాలు ఇస్తున్న నూతన విధానం
కరీంనగర్,మే17(జనం సాక్షి): ఇసుక రవాణా ట్రాక్టర్లకు జియోట్యాగింగ్ అనుసంధానం చేశారు. రవాణాలో అక్రమాలు లేకుండా ఉండేందుకు ట్రాక్టర్ల డబ్బాలకు ప్రత్యేకమైన రంగును ఏర్పాటు చేశారు. రీచ్ నుంచి బయలు దేరిన తర్వాత బుకింగ్ చేసిన యజమాని ఇంటి వద్దకు ట్రాక్టర్ వెళ్లే వరకు ఇంటర్‌నెట్‌లో కదలికలను చూసుకునేలా రూపకల్పన చేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇసుక నిర్వహణ సంఘం అధ్యక్షుడిగా సంయుక్త పాలనాధికారి, కార్యదర్శిగా గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకులు, కన్వీనర్‌గా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలతోపాటు ఇసుక రీచ్‌లున్న మండల తహసీల్దార్లు కూడా సొసైటీ సభ్యులుగా ఉంటారు. వీరి పర్యవేక్షణలో అమలు చేస్తున్నారు. ఇలా ఇసుక అక్రమ రవాణాకు అడ్డకట్ట వేసి సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించిన నూతన ఇసుక విధానం సత్ఫలితాలు ఇస్తోంది. నూతన ఇసుక విధానంతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. గతంలో గోదావరి, మానేరు, వాగుల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకున్నారు. ప్రధాన రీచ్‌ల నుంచి రవాణా సల్పిలితాలునిస్తుండటంతో ఇప్పుడు ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. ప్రజలు కోరిన చోటకే చేరేలా ఇంటర్‌నెట్ బుకింగ్..రవాణాలో అక్రమాలు చోటు చేసుకోకుండా ‘జియో ట్యాగింగ్’ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారా జరిగే ఈ పక్రియలో 24 గంటలలోపు ఇసుకను సరఫరా చేసే యంత్రాంగాన్ని రూపకల్పన చేశారు. విూ సేవ కేంద్రాలు, తెలంగాణ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కూడా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొబైల్ యాప్ ద్వారా కూడా వెసులుబాటు కల్పించారు. దేశంలోనే ఈ తరహా విధానం ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలో ప్రధానమైన గోదావరి, మానేరు నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ఎనిమిది ఇసుక రీచ్‌లను గుర్తించింది. వీటిల్లో గోదావరి తీరంలోని అంతర్గాం మండలం గోలివాడ, మంథని మండలం పోతారం, మానేరు తీరంలోని సుల్తానాబాద్ మండలం గ్టటెపల్లి, కదంబపూర్, ఓదెల మండలం కనగర్తి, కాల్వశ్రీరాంపూర్ మండలం విూర్జంపేట, ముత్తారం మండలం ముత్తారం, మంథని మండలం చిన్న ఓదెలలో రీచ్‌లను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల నుంచి ఇసుక అవసరమైన వారికి దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద పొరుగు సేవల సిబ్బందిని నియమించారు. ఒక్కో రీచ్‌లో ఒక్కో అధికారి, ఇద్దరు సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. పాలనాధికారి కార్యాలయంలో ఇద్దరు నోడల్ అధికారులు, కాల్‌సెంటర్, ఖాతాల నిర్వహణ కొనసాగుతోంది. ఇసుక కోసం బుకింగ్ చేసిన తరువాత ఎక్కడి నుంచి రవాణ జరుగుతుంది..? ట్రాక్టర్ నంబర్, డ్రైవర్ ఫోన్ నెంబర్‌తో దరఖాస్తుదారుడి ఫోన్‌కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. ఇసుకకు దూరాన్ని బట్టి రవాణ, ఇతర ఛార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పక్రియను నిరంతరం సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తుండటంతో పర్యావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.