జిల్లాలో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సన్నాహాలు

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటుతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూశాఖ సన్నద్ధం అవుతోంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, కబ్జాకు గురికాకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూ వివరాలను తెలుసుకునేందుకు జీఏహెచ్‌ సిస్టమ్‌తో శాటిలైట్‌కు అనుసంధానం చేసే సరికొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లాలోని 13మండలాల్లో గ్రామాల వారీగా భూముల వివరాలను సేకరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకువస్తే భారీ, మధ్య తరహా పరిశ్రమలకు అనువైన భూములు ఎక్కడ ఉన్నాయి? ఇతర అవసరాలకు ఏ ప్రాంతంలో ఏ భూములను కేటాయించాలి? ఏది అనువైనదిగా ఉంటుందో ల్యాండ్‌బ్యాంకు సిస్టమ్‌లో చూసుకొని కేటాయించేందుకు వీలుంటుంది. జిల్లా వ్యాపితంగా గుట్టలు, చెరువులు, ఖనిజాలు, నీటి వనరులు, బీడు భూమి, సాగు చేస్తున్న భూమి, ప్రభుత్వ, శిఖం, పంచరాయి, సీలింగ్‌ వంటి అన్ని రకాల భూముల వివరాలన్నీ సేకరిస్తున్నారు. తెలంగాణ స్టేట్‌రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (టీఆర్‌ఏసీ) సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములతోపాటు అన్నిరకాల భూముల వివరాలను శాటిలైట్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కార్యాలయంలోని సిస్టమ్‌ ఓపెన్‌ చేసుకుంటే భూమి ఎలా ఉంది, ఎంత ఉంది? భూముల్లో ఏమైనా

నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే విషయాలు తెలిసిపోతాయి. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, శ్మశా నవాటికలు, దేవాలయాలు, ఇతర ప్రజాప్రయోజనకరమైన సంస్థల నిర్మాణం

కోసం ప్రస్తుతం జిల్లా కేంద్రం పరిసరాల్లో వందల ఎకరాల్లో స్థలం అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వ భూమి వివరాలు, నీటి వనరులు, ఖనిజాలు వంటి అంశాలపై వివరాలు అవసరం అవుతాయి. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తేతప్ప పూర్తి వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో ఈ సిస్టమ్‌ ద్వారా భూమిని అనుసంధానం చేసి ల్యాండ్‌ బ్యాంకును రూపొందిస్తే ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తిస్థాయి వివరాలు సులువుగా అర్థం అవుతాయి. సెప్టెంబర్‌ 15నుంచి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి శరవేగంగా జరుగుతున్న ఈ పక్రియ డిసెంబర్‌ 15 నాటికి వందశాతం పూర్తి చేసేలా రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం గ్రామాల వారీగా నోషనల్‌ నంబర్లు కేటాయించి ఒక్కో రకం భూమికి ఆరు డిజిటల్‌ నంబర్లతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయించి ఆక్రమణలు, దొంగ రిజిస్టేష్రన్లు లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా వెబ్‌ల్యాండ్‌లోని 1-బీ సమాచారం ఆధారంగానే రైతులకు తాకట్టులేని రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధంచేస్తోంది.