జూరాలకు పెరిగిన వరద ఉదృతి
మహబూబ్‌నగర్: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల పూర్తిస్థాయి నీటిట్టం 318.51 మీటర్లు కాగా ఇప్పుడు 316.71 మీటర్ల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకుగాను ప్రస్తుతం 6.23 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక ఎగువన మహారాష్ట్రలో ఉన్న ఆల్మట్టి నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నది. ఉదయం 10.30 గంటల వరకు అది 2.50 లక్షలకు చేరవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.24 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.623 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థం 33.313 టీఎంసీలు.