ఎస్‌ఐఆర్‌.. రైట్‌ రైట్‌

` ప్రక్రియ కొనసాగాల్సిందే
` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను సవాల్‌ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతోన్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్‌ఓలు (బూత్‌ లెవెల్‌ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్‌ఓలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడిరచింది. బీఎల్‌ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్‌ఐఆర్‌ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడిరచింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐఆర్‌లో భాగమైన పలువురు బీఎల్‌వోలు అనారోగ్యానికి గురి కావడం, రాజీనామాలు చేస్తుండటం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తోన్న సంగతి తెలిసిందే. ‘‘బీఎల్‌వోలు పనిభారం, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార చర్యలు తీసుకోవచ్చు. వారి పని గంటలు తగ్గించేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎస్‌ఐఆర్‌ విధుల నుంచి తమను మినహాయించాలని ఎవరైనా కోరితే.. అటువంటి కేసులను విడివిడిగా పరిశీలించి, వారి స్థానంలో మరొకరిని భర్తీ చేయొచ్చు. ఎస్‌ఐఆర్‌ కోసం అవసరమైన సిబ్బందిని కేటాయించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంది’’ అని న్యాయస్థానం గతంలో పేర్కొంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్‌ఐఆర్‌ కొనసాగుతోంది.