బియ్యంపై బాదుడు!

` భారత్‌పై మళ్లీ సుంకాలకు ట్రంప్‌ రెడీ?
న్యూయార్క్‌(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్‌- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని అక్కడి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్‌ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా రైతుల కోసం 12 బిలియన్‌ డాలర్ల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రారంభానికి వైట్‌హౌస్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ట్రంప్‌ మాట్లాడుతూ.. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్‌లోకి డంప్‌ చేస్తున్నాయంటూ వస్తున్న వాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్‌లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదించారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ మాట్లాడుతూ.. వారు (పలు దేశాలను ఉద్దేశిస్తూ) మోసం చేస్తున్నారని.. సుంకాల విధింపు మార్గాన్ని అనుసరించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కెనడా నుంచి ఎరువుల దిగుమతుల పైనా ఆయన ప్రస్తావించారు.ఓ రైస్‌మిల్‌ సీఈఓ మెరిల్‌ కెన్నెడీ మాట్లాడుతూ.. అగ్రరాజ్యానికి తమ ఉత్పత్తులను డంప్‌ చేస్తున్న దేశాల్లో భారత్‌, థాయ్‌లాండ్‌ చైనాలు ప్రధానంగా ఉన్నాయన్నారు. చైనా వస్తువులు ఏకంగా ప్యూర్టోరికోలోకి కూడా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనేక సంవత్సరాలుగా తామే ప్యూర్టోరికోకు బియ్యం ఎగుమతులు చేయడం లేదని వెల్లడిరచారు. వీటన్నింటివల్ల దక్షిణాదిలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విధించిన సుంకాలు పని చేస్తున్నాయని.. అయితే, వాటిని రెట్టింపు చేయాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. వివిధ దేశాలపై విధించిన సుంకాలను పెంచాలా అని అడిగారు. ఇందుకు రైతులు బదులిస్తూ ఇతర దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులను నియంత్రించాలని కోరారు. అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని వాణిజ్య కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ను ట్రంప్‌ ఆదేశించారు. స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ.. వీటిలో భారత్‌, థాయ్‌లాండ్‌, చైనాలు ముందున్నాయన్నారు. మరిన్ని దేశాలు కూడా ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి జాబితా అందిస్తామని తెలిపారు. వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ హామీ ఇచ్చారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల ప్రారంభానికి ముందే ట్రంప్‌ అదనపు సుంకాల గురించి ఆలోచనలు చేయడం గమనార్హం. ఇక, భారత్‌- అమెరికాల మధ్య ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన చర్చలు ఈనెల 10 నుంచి దిల్లీలో జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్‌ స్విట్జర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటించనున్నారు. ఈ చర్చల్లో భారత్‌ తరఫున వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ పాల్గోనున్నారు.