జోరుగా రైతుబీమా వివరాల సేకరణ
నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు
కరీంనగర్,జూన్21(జనం సాక్షి): రైతుబంధు జీవిత బీమా పథకం అమలు జరుగుతున్న తీరును జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. సిఎం కెసిఆర్ దేశాలతో వీరంతా ప్రత్యక్షంగా పర్యవేక్షి స్తున్నారు. ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రైతులకు సందేహాలను నివృతత్తి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడుతూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీ బీ వినోద్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించి పథకం అమలు తీరును పరిశీలించారు. అధికారులు, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ కూడా తమనియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లి రైతులతో మమేకం అవుతున్నా రు. పత్రాలు స్వయంగా రైతులకు పంపిణీ చేస్తున్నారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయాన్ని అందుకున్న రైతులు ఇపుడు జీవిత బీమా పథకంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు బీమాపైనే చర్చ జరుగుతోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, సమన్వయ సమితుల సమన్వయకర్తలు, సభ్యులు అర్హులైన రైతుల పేర్లను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏఈఓలు ఉదయం 6 గంటలకే గ్రామాలకు వెళ్లి 10 గంటల వరకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంటున్నారు. ఏఈఓలు ప్రతి రోజూ రైతుల దరఖాస్తులు, నామినీ పత్రాలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, ఇతర వ్యవసాయ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తూ బీమా పత్రాల పంపిణీ, నామినీ పత్రాల సేకరణను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులైన రైతుల పేర్లను సేకరించాలని ఆదేశించారు. ఈ మేరకు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఎల్‌ఐసీ సంస్థ నిబంధనల మేరకు 18 నుంచి 59 ఏండ్లలోపు రైతులను అర్హులుగా గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులను మాత్రమే ఈ పథకం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల అందుకున్న రైతుల్లో 10 శాతం మంది వయోపరిమితి దాట వచ్చని అధికారులు అనుకున్నారు. ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉన్నా ప్రభుత్వం జీవిత బీమా కల్పిస్తామని చెబుతున్న నేపథ్యంలో తమ పేరిట ఉన్న భూములను తల్లిదండ్రులు వారి పిల్లల పేర విరాసత్ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా కూడా కొన్ని కుటుంబాల్లో ఉన్న భూ పంపకాల సమస్యకు పరిష్కారం లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.