జోరు వానలో ఘనంగా బంజారాల ‘సీత్ల భవాని పండుగ’

, జూలై 12( జనం సాక్షి ): మండల వ్యాప్తంగా బంజారాలు సీత్ల భవాని పండగను మంగళవారం జోరు వానలో జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో పెద్దపుశాల కార్తెలో మొదటి మంగళవారం యావత్ బంజారా( లంబాడీలు) గిరిజనుల జాతికి చెందిన వారు ప్రత్యేక సంప్రదాయంగా సీట్ల పండుగ( దాటుడు) జరుపుకుంటారు. మండలంలో ఏ తండాలో చూసిన యువతులు, యువకులు, బంజారా మహిళలు, నాయకుడు, కార్బరీ డప్పులతో ,ఆటపాటలతో చెట్లకు యువకులు తాళ్లతో ఊయలలు తయారుచేసి యువతులను ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని టేకులపల్లి ,ముత్యాలంపాడు, సులానగర్ ,కోయగూడెం ,తడికలపూడి, బేతంపూడి, బోడు, మద్రాస్ తండా, బొమ్మనపల్లి, తావూరియా తండా, 9వ మైలు తండా, సీతారాంపురం, హనుమాన్ తండా  , మంగలి తండా, జైత్యా తండా చుక్కలబోడు, మద్దిరాల తండా, కోకియ తండా, కొత్త తండా, లక్ష్మీపురం తండా, రుక్మా తండా, తూర్పు గూడెం, బిల్లుడు తండా రాజారాం తండా, కొండం గల బోడు తదితర తాండాలలో ఈ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బంజారాలు తండాలలో ఉన్న పశువుల సంపద, పాడిపంటలు, కోళ్లు ,గొర్రెలు, మేకలు సంపద ఆరోగ్యంగా పెరగాలని, పశువుల దూడలకు పాలు సరిపోవాలని, అంటు రోగాలు తొలగిపోవాలని, పశువులకు పచ్చటి గడ్డి బాగా దొరకాలని, అటవీ సంపద తరిగిపోకూడదని ఏడుగురు దేవతలకు  మొక్కులు తీర్చుకునే బంజారాలకు ప్రత్యేకమైన పండుగగా చెప్పుకుంటారు. దీనినే తండాలలో లంబాడి జాతికి చెందిన గిరిజనులు దాటుడు పండుగగా చెప్పుకుంటారు. ఈ పండుగలో ప్రత్యేకంగా ఏడుగురు దేవతలను పాటలతో ,నృత్యాలతో కొలుస్తారు. మేరమ్మ ,తుల్జా, భవాని,  సీట్ల యాడి, మంత్రం,  హింగ్లా ద్వాల్, అంగళ్ కంకాలి అనే ఏడుగురు దేవతలను ఒకే దగ్గర పంట పొలాల మధ్యలో గల ఒక మైదానంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి మొక్కుతారు. మేక, గొర్రె నో బలి ఇచ్చి దాని పేగును బారుగా చేసి పశువులను ఆ పేగు పై నుండి దాటిస్తారు. ప్రతి కుటుంబం కోడిని కోసి దాటుతున్న పశువుల పైకి విసిరి వేస్తారు. బంజారా మహిళలు పాటలు, నృత్యాలతో వెళ్లి పూజల అనంతరం పిండి వంటలు చేస్తారు. ఈ పండుగను జరుపుకోవడం మూలాన మంచి వర్షాలు కురుస్తాయని, పశు సంపద బాగా వృద్ధి చెందుతుందని ,పంటలు బాగా పండుతాయి అని నమ్మకంతో తరతరాలుగా ఈ పండుగ సాంప్రదాయంగా బంజారా లు జరుపుకుంటారు.