టీడీపీకి ఇదే చివరి అవకాశం

తెలంగాణపై శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ప్రకటించే వైఖరే తెలంగాణ ప్రజలు వారికిచ్చే చివరి అవకాశం. ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీనో, మరొకరినో నిందిస్తూ కాలం వెళ్లదీసిన టీడీపీకి ఇకపై ఆ అవకాశం ఉండబోదు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు తనకు రెండు కళ్లలాంటివంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వల్లెవేసిన రెండు కళ్ల విధానం ఇకపై పనిచేయబోదు. రెండు కళ్లు, రెండు చెవులు అంటూ ఇకపై సన్నాయినొక్కులు నొక్కితే ఈ ప్రాంతంలో రెండు కాళ్లను కదలనివ్వబోమని ఇప్పటికే తెలంగాణవాదులు హెచ్చరించారు. వాని ఆవేదనకు, ఆవేశానికి అర్థం ఉంది. నిజాం పాలనలోని హైదరాబాద్‌ స్టేట్‌ను ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన సీమాంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసిన నాడు కూడా ఇక్కడి ప్రజలు కూడా అయిష్టంగానే అంగీకరించారు. ఆ సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం, స్థానికులు ఉద్యోగ అవకాశాలపై రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ నిబంధనలు తుంగలో తొక్కారని తెలంగాణ విద్యార్థిలోకం భగ్గుమంది. ఫలితంగా 1969లో మా తెలంగాణ మాగ్గావాలే అనే నినాదంతో విద్యార్థులు, యువత ఉద్యమ బాటపట్టారు. సీమాంధ్ర నేతల కవ్వింపు చర్యలతో ఉద్యమం హింసామార్గం పట్టింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి 360 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారు. తమ వనరులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు ధర్మబద్ధంగా పోరుబాట పట్టిన రేపటి భారత పౌరులు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థుల ప్రాణాలు అన్యాయంగా బలిగొన్న సీమాంధ్ర పెత్తందారులు 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి తెరతీశారు. వారే ఇప్పుడు కొత్తగా సమైక్యాంధ్ర పేరుతో స్పాన్సర్డ్‌ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇందుకు తెరవెనుక సూత్రదారి కూడా చంద్రబాబు నాయుడే అనే ఆరోపణలున్నాయి. ఆ పార్టీని వీడిన ఒకరిద్దరు శాసనసభ్యులు ప్రజలకు చేరువయ్యేందుకో, తమపై విమర్శలు రాకుండా ఉండేందుకో బాబు లక్ష్యంగా 2009 డిసెంబర్‌ 10న ఆయన మాటలను ఉదహరించిపోతున్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం ఏమైనా చంద్రబాబు నిజ స్వరూపం ఇది అని మాత్రం తెలిసింది. టీ జేఏసీలో భాగస్వాములుగా ఉంటామని టీ టీడీపీ నేతలు చెప్పినా చంద్రబాబు అంగీకరించలేదు. పార్టీ జెండా కిందనే తెలంగాణ ఉద్యమం చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆయనకు అప్పుడు జీ హుజూర్‌ అన్న టీడీపీ నేతలు తర్వాతి పరిణామాలతో కొద్దిగా భూమార్గం పట్టారు. నేల విడిచి సాము చేస్తే తామే నష్టపోతామని గ్రహించిన కొందరు సొంతదారి చూసుకున్నారు. మరికొందరు ఆ పార్టీలో ఉంటేనే తెలంగానం ఆలపిస్తూ టీ జేఏసీ నాయకులు, ఉద్యమకారులను టార్గెట్‌ చేయడం పనిగా పెట్టుకున్నారు. దీంతో వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలకు చేరువ కాలేకపోయారు. తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సమస్యను మొదటికి తెచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీకి చెందిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఉప ఎన్నికల్లో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారిపై మిగతా పార్టీలు అభ్యర్థులను నిలపొద్దని జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

కానీ ఆయా పార్టీలను ప్రజలు విశ్వసించలేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ సహా కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పోటీ చేసిన అందరికీ తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. టీడీపీ పక్షాన పోటీ చేసిన ఎవరికీ డిపాజిట్‌ కూడా దక్కలేదంటే ప్రజలు వారిని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. అలా తిరస్కరించిన వారిలో నేడు టీడీపీ పక్షాన అఖిలపక్షానికి హాజరయ్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు. మంత్రిగా వరంగల్‌ జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కడియం వరుసగా రెండో సారి ఎన్నికల్లో ఘోర పరాజయం మూట గట్టుకున్నారు. అయినా వారిలో పెద్దగా మార్పేమి రాలేదు. పాత పద్ధతిలోనే టీజేఏసీ నేతలు, తెలంగాణవాదులపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు గుప్పించారు. గుప్పిస్తూనే ఉన్నారు. ఇది ప్రజల్లో వారిపట్ల ఏవగింపును పెంచింది. స్వచ్ఛందంగా తెలంగాణ కోసం పోరాడుతున్న వారిని అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ పలువురుని ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి బాబు వచ్చిన సమయంలో తెలంగాణవాదులపై చంద్రదండు ఆగడాలు, తదనంతర కాలంలో టీడీపీ నేతల దుందుడుకు వైఖరిపై భారీస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పరిస్థితి దిష్టిబొమ్మల దహనాల వరకు వెళ్లింది. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక వాదానికి అత్యంత దూరంలో ఉన్నారని ఇక్కడి ప్రజలు ఎంతగా విశ్వసించారో అర్థం చేసుకోవచ్చు. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబుకు మహబూబ్‌నగర్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా వరకు ప్రజలు నిరసనలతోనే స్వాగతం పలికారు. అవకాశం చిక్కిన ప్రతిసారి అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళనలతో టీడీపీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతం నుంచి కాస్త పక్కకు జరిగినట్లుగా సంకేతాలు పంపుతున్నారు. అందులో భాగంగానే గురువారం తాను ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఇకపై కూడా మాట్లాడబోనని తెలిపారు. ఇప్పటికైతే అఖిలపక్షం గండం గట్టెక్కాలనే భావనతో బాబు ఈ వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆయనను, ఆయన పార్టీని క్షమించబోరు. సీల్డ్‌ కవర్‌లో వైఖరి రాసి నిక్షిప్తం చేశామని, అఖిలపక్షం ముగిసిన తర్వాత మీడియాకు వెల్లడిస్తామని ఆ పార్టీ ప్రకటించడం కూడా ఆమోదయోగ్యం కాదు. పార్టీకంటూ ఓ వైఖరి ఉండాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆ వైఖరికి కట్టుబడి ఉండాలి. దీనిని టీడీపీ ఎప్పుడో విస్మరించింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలపై ప్రేమతో టీడీపీ అధినేత పై విధంగా వ్యాఖ్యలు చేశారనుకోవడం పొరపాటే. వారి ప్రకటన వెనుక ఓట్లు, సీట్ల రాజకీయమే దాగి ఉంది. ఇంతకాలం ఎన్ని మోసాలు చేసినా పోని అనుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు అన్ని పార్టీల నుంచి నిర్దిష్టమైన విధానాలు ఆశిస్తున్నారు. అన్నింటికన్నా ముందుగా పాదయాత్రకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై అఖిలపక్షం పెట్టాలని కోరుతూ లేఖ రాశాడు. ఇప్పుడు అఖిలపక్షం పెట్టారు. ముందు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. వారికి ప్రజలు ఇచ్చే చివరి అవకాశమిదే. ఇప్పుడు కూడా పాత బుద్ధే ప్రదర్శిస్తే ఏం చేయాలో ప్రజలకు తెలుసు.